: షారూఖ్ ను కీర్తించిన సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్, సల్మాన్ ఖాన్ ల మధ్య వివాదం సమసిపోయినట్టుంది. 2008 జూలై 21న బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ పుట్టినరోజు సందర్భంగా చెలరేగిన వివాదం సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. షారూఖ్ పేరు సల్మాన్ దగ్గర, సల్మాన్ పేరు షారూఖ్ దగ్గర ఎత్తడానికి ఎవరూ సాహసం చేసేవారు కాదు. పలు ఇంటర్వ్యూల్లో కూడా వారి మధ్య విభేదాలు ఉన్నట్టు స్పష్టమైంది. 2013 రంజాన్ ప్రార్థనల తరువాత ఇఫ్తార్ విందు సందర్భంగా వీరు ఆలింగనం చేసుకోవడంతో వివాదం కాస్త సడలింది. ఈ ఏడాది కూడా ఇప్తార్ విందు సందర్భంగా వీరు ఆలింగనం చేసుకోవడం, సినిమా ఫంక్షన్లలో 'హాయ్ షారూఖ్' అంటూ సల్లూభాయ్ పలకరించడం వంటివన్నీ కలిసి వారి మధ్య అంతరం తగ్గించినట్టున్నాయి. ‘కిక్’ సినిమా వందకోట్లు వసూలు చేయడంతో... వరుసగా ఏడు సల్మాన్ సినిమాలు... వంద కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించాయి. ఈ సందర్భంగా సల్లూభాయ్ ని మీడియా ప్రశ్నించింది. వరుస హిట్ సినిమాలతో బాలీవుడ్ కు కింగ్ అయ్యారా? అని ప్రశ్నించిన మీడియాతో బాలీవుడ్ కింగ్ షారూఖేనని కితాబిచ్చాడు. షారూఖ్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశాడు. బాలీవుడ్ నెంబర్లపై తనకు నమ్మకం లేదని సల్లూభాయ్ వివరించాడు.

More Telugu News