: పాప ఏడుపు ఆ కుటుంబం ప్రాణాలు నిలబెట్టింది!

మహారాష్ట్రలోని మాలిన్ గ్రామంలో కొండకు దిగువ భాగాన కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే, వర్షాల కారణంగా కొండపై మట్టిదిబ్బలు కరిగి వారి నివాసాలపై పడ్డాయి. ఈ ఘటనలో 40 నివాసాలు ధ్వంసం కాగా, 51 మంది చనిపోయారు. 150 మంది ఆచూకీ తెలియరాలేదు. అయితే, సహాయకచర్యలు చేపట్టిన అధికారులకు ఓ ప్రాంతం నుంచి చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అక్కడికెళ్ళి బురద తొలగించి చూడగా ఓ పాప తన తల్లి సహా కనిపించింది. ఆ తల్లి తన చిన్నారిపై మట్టి పడకుండా రక్షణగా తన శరీరాన్ని కప్పేసిన స్థితిలో ఉంది. వారిద్దరినీ బయటికి తీస్తుండగానే, అక్కడే మరో ఇద్దరు సహాయం కోసం కేకలు వేశారు. అరుపులు వినపడ్డ ప్రదేశంలో మట్టిని తొలగించగా ఆ పాప బామ్మ, తాతయ్యలు బయటపడ్డారు. ఆ పాప ఏడుపు ఆ విధంగా ఓ కుటుంబం ప్రాణాలు నిలబెట్టింది. ఆ చిన్నారి పేరు రుద్ర, వయసు మూడు నెలలే. తాను బిడ్డకు పాలు ఇస్తుండగా ఒక్కసారి మట్టిదిబ్బలు విరిగి ఇంటిపై పడ్డాయని రుద్ర తల్లి చెప్పింది. ఇక, రుద్ర బామ్మ శకుంతల మాట్లాడుతూ, తామెలా బతికామో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు. ప్రస్తుతం వారు నలుగురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి తీవ్రగాయాలేమీ కాలేదని, పొరుగువారు మృత్యువాత పడడంతో షాక్ కు గురయ్యారని వైద్యులు తెలిపారు.

More Telugu News