: ఈ పైలట్ కామాంధుడు... విచారణకు ముందే మరణించాడు!
సైమన్ ఉడ్... ఇతగాడు బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ఫస్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించాడు. సంస్థ నియమావళి అనుసరించి ఈ ఎయిర్ వేస్ కొన్ని ఆఫ్రికా దేశాల్లో చారిటీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో విధి నిర్వహణ నిమిత్తం సైమన్ ఉడ్ టాంజానియా, కెన్యా, ఉగాండా వంటి దేశాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా పలు అనాథాశ్రమాలు, పాఠశాలల్లోని చిన్నారులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే, ఉడ్ 2013లో ఓ ట్రెయిన్ యాక్సిడెంట్ లో మరణించాడు. అప్పటికే ఆ కామాంధుడిపై ఓ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో అభియోగాలు నమోదయ్యాయి. కేసు విచారణకు రెండు వారాల ముందే అతగాడు మరణించాడు. దీంతో, అతనికి ఉపాధి కల్పించిన బ్రిటీష్ ఎయిర్ వేస్ అతడి నేరాలకు బాధ్యత వహించాలని బాధితులు అంటున్నారు.
వారు ఇప్పుడు బ్రిటీష్ ఎయిర్ వేస్ పై దావా వేసేందుకు సిద్ధమయ్యారు. 8 నుంచి 20 ఏళ్ళ వయసున్న బాలికలను ఉడ్ లైంగికంగా వేధించేవాడని బాధితుల తరఫు న్యాయవాది నికోలా మార్షల్ చెప్పారు. త్వరలోనే ఈ కేసు లండన్ కోర్టులో విచారణకు రానుంది. ఉడ్ బాధితులు ఇంకా ఎందరున్నారన్న విషయమై ఓ బృందం కెన్యా, ఉగాండా దేశాల్లో పర్యటిస్తోందట.