: ఆ చివరి వ్యక్తి కూడా మరణించాడు!

రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా అమెరికా బాంబర్ బి-29 జపాన్ నగరం హిరోషిమాపై అణుబాంబు వేయడం తెలిసిందే. బాంబు వేసిన సమయంలో బి-29లో ఉన్న సిబ్బందిలో థియోడర్ వాన్ కిర్క్ (93) ఒకరు. మిగిలిన సిబ్బంది ఎప్పుడో మరణించగా, వాన్ కిర్క్ సోమవారం తుదిశ్వాస విడిచారు. దీంతో, ఆనాటి చారిత్రక ఘటనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న చివరి వ్యక్తి కూడా మరణించినట్టయింది. వృద్ధాప్యంతోనే ఆయన కన్నుమూశారని వాన్ కిర్క్ కుమారుడు టామ్ తెలిపారు. కాగా, వాన్ కిర్క్ తన ఉద్యోగకాలంలో 60 బాంబింగ్ ఆపరేషన్లలో పాల్గొన్నారు. జపాన్ పై చేపట్టిన ఒక్క బాంబింగ్ ఆయనకు చరిత్రలో స్థానం కల్పించింది. ఆ ఆపరేషన్ లో ఆయన ప్లేన్ నావిగేటర్ గా విధులు నిర్వర్తించారు. రెండో ప్రపంచయుద్ధ చివరి దశలో అమెరికా 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అణుబాంబు జారవిడిచింది. ఆ బాంబు పేరు లిటిల్ బాయ్ కాగా, దాని బరువు 9 వేల కిలోలు. ఈ ఘటనలో హిరోషిమా నేలమట్టం కాగా, పేలుడు కారణంగానూ, తదనంతర ప్రభావాల కారణంగానూ మొత్తం 1,40,000 మంది చనిపోయారు.

More Telugu News