: బ్రిటీష్ శాస్త్రవేత్తల అద్భుతం: కేన్సర్ ను ఇకపై చిన్న రక్తపరీక్షతో గుర్తించవచ్చు
కేన్సర్ ను సులువుగా గుర్తించే ప్రక్రియను బ్రిటీష్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పరీక్ష ద్వారా ఏ రకమైన కేన్సర్ నైనా చాలా తేలికగా గుర్తించవచ్చు. ఇప్పటివరకు ఏ రకమైన కేన్సర్ నైనా గుర్తించడానికి డాక్టర్లు బయాప్సీ టెస్ట్ (బయాప్సీ అంటే డాక్టర్లకు పేషంట్ లోని ఏ భాగంలో కేన్సర్ ఉందన్న అనుమానం ఉందో, ఆ భాగంలో కొంత ముక్కను కట్ చేసి... పరిశీలించడానికి లేబరేటరీకి పంపిస్తారు)ను సూచించేవారు.
బయాప్సీ పరీక్షకు వేలకు వేలు ఖర్చవడమే కాకుండా... ఓ సంక్లిష్టమైన ప్రక్రియ. అయితే తాజాగా బ్రిటీష్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన పద్దతి ద్వారా చిన్న రక్తపరీక్ష ద్వారా కేన్సర్ ను గుర్తించవచ్చు. ఈ పరీక్షతో కేన్సర్ ను గుర్తించడం సులవు అవడమే కాదు, పరీక్ష కూడా కేవలం వందల రూపాయల్లో పూర్తయిపోతుంది. తాజాగా కనిపెట్టిన ఈ పద్దతి ద్వారా కోట్లమంది ప్రజలకు లాభం కలుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
బ్రిటీష్ శాస్త్రవేత్త ఆండర్సన్ ఈ ప్రక్రియను కనుగొన్నాడు. ఈ పక్రియకు అతడు లిప్టోసైట్ జినోమ్ సెన్సిటివిటీ (ఎల్‌జిఎస్) అని పేరు పెట్టాడు. ఈ పరీక్ష ద్వారా అత్యంత సూక్ష్మస్థాయిలో ఏ రకమైన లోపానికి ఆస్కారం లేకుండా కేన్సర్ లక్షణాలను నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఎల్ జిఎస్ ఫార్ములా: సాధారణంగా మన శరీరంలో తెల్లరక్తకణాలు మన ఇమ్యూనిటీకి (వ్యాధి నిరోధకతక) ప్రధాన కారణం. శరీరంలోకి ఏ వ్యాధి కారక బాక్టీరియాలు, వైరస్ లు ప్రవేశించినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడతాయి. కేన్సర్ వచ్చినప్పుడు కూడా తెల్లరక్తకణాలు కేన్సర్ కణాలతో పోరాడతాయి. ఈ క్రమంలో కేన్సర్ ఉన్న పేషంట్లోని తెల్లరక్తకణాలు (వాటి డి.ఎన్.ఎ) కేన్సర్ కణాలతో తీవ్రంగా పోరాడతాయి. కేన్సర్ కణాలతో పోరాటం కారణంగా తెల్లరక్తకణాలు (వాటిడి.ఎన్.ఎ) ఎక్కువ ఒత్తిడిలో ఉండి అలసిపోతాయి. అదే కేన్సర్ లేని మనుషులలో తెల్లరక్తకణాలు ఆరోగ్యంగా... ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటాయి. ఈ సూత్రం ఆధారంగానే లిప్టోసైట్ జీనోమ్ టెస్ట్ ను రూపొందించారు.