: 23 లక్షల ఎకరాల ఆయకట్టును చూపించారు... కానీ కాల్వలు తవ్వలేదు: చంద్రబాబు
23 లక్షల ఎకరాలకు పైగా అదనపు ఆయకట్టును లెక్కల్లో చూపించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కానీ, అది కాగితాలకే పరిమితమైందని ఆయన అన్నారు. లెక్కల్లో చూపించారు కానీ కాల్వలు తవ్వలేదని ఆయన చెప్పారు. గత పదేళ్లుగా ఎన్ని తప్పులు చేయాలో... అన్ని తప్పులను చేశారని బాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. కానీ వాటినన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని అన్నారు. సాగునీటి సంఘాలతో సత్ఫలితాలు వచ్చాయని అన్ని సర్వేలు చెప్పాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ లకు 9 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
తోటపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తే శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని, కానీ అలా జరగలేదన్నారు. కొన్ని ప్రాజెక్టులకు భూసేకరణ ఇంతవరకు జరపలేదన్నారు. దానివల్ల ప్రాజెక్టు అంచనాలు కోట్లాది రూపాయల మేర పెరిగిపోయాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టు తీసుకొచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు తప్ప ఒక్క ప్రాజెక్టును పూర్తిచేయలేదని ఆయన చెప్పారు. ప్రణాళిక లేకుండా ప్రాజెక్టులన్నింటినీ ఒకేసారి ప్రారంభించారని, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకున్నారని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల పుణ్యమా అని కాంగ్రెస్ పెద్దలంతా జలయజ్ఞం పేరుతో లాభపడ్డారని ఆయన అన్నారు.
ఇష్టానుసారంగా ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులను మొదలుపెట్టారని ముఖ్యమంత్రి చెప్పారు. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టుల పేరుతో డబ్బులు వసూలు చేసుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తోటపల్లి ప్రాజెక్టును వెంటనే చేపట్టాల్సి ఉందని, ఆ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చంద్రబాబు చెప్పారు. నదీ జలాల వినియోగం పైన అపెక్స్ కమిటీలు వచ్చాయని, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా అడ్డుకున్నామని ఆయన అన్నారు.