: ఘరానా మోసగాడు... సెక్యూరిటీ గార్డులా వచ్చి అకౌంట్ ఖాళీ చేశాడు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఘరానామోసం వెలుగుచూసింది. బిళ్ల కొల్లాపురి అనే వ్యక్తి అమలాపురంలోని హైస్కూలు సెంటర్ లోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. ఎంత ప్రయత్నించినా డబ్బులు రాలేదు. ఇంతలో సెక్యూరిటీ గార్డు యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు. డబ్బులెందుకు రావడం లేదు? అని ప్రశ్నించడంతో తాను ప్రయత్నిస్తానని అడిగి ఏటీఎం కార్డు తీసుకున్నాడు, పిన్ నెంబర్ అడిగి ప్రయత్నించాడు. తరువాత డబ్బులు రావడం లేదని చెప్పి ఏటీఎం కార్డు తిరిగి ఇచ్చేశాడు. దీంతో కొల్లాపురి వేరే ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ కూడా చుక్కెదురైంది.
దీంతో తన కార్డు బ్లాక్ చేయాలని బ్యాంకుకు వెళ్లాడు. విషయం చెప్పి ఖాతా సరిచూసుకుని గతుక్కుమన్నాడు. తన ఖాతాలో 40 వేల రూపాయల నగదు మాయమైంది. దీంతో పరిశీలించగా కొంకాపల్లి ప్రాంతంలో ఉన్న ఏటీఎం నుంచి 40 వేల రూపాయలు డ్రా అయినట్టు బ్యాంకు అధికారులు అతడికి చెప్పారు. దీంతో కొల్లాపురి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎంకు వెళ్లినప్పుడు ఎవరు అడిగినా పిన్ నెంబర్ చెప్పకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.