: కేసీఆర్ చేతిలో తెలంగాణను పెడితే... మరోసారి మోసపోవాల్సి వస్తుంది: పవన్

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు, మౌలికవసతులు కావాలని... అవి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆసరా తప్పక ఉండాలని చెప్పారు. రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ అని, కాబోయే ప్రధాని మోడీ అని... అలాంటప్పుడు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోడీ మద్దతు అవసరమని తెలిపారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తిట్టడం అలవాటని... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని హితవు పలికారు. మోడీ లేదు, గీడీ లేదు అని గతంలో కేసీఆర్ అన్నారని... అలాంటప్పుడు, రేపు మోడీ ప్రధాని అయితే తెలంగాణకు కేసీఆర్ ఏమి సాధిస్తాడని ప్రశ్నించారు. జిల్లాకో విమానాశ్రయం వచ్చేలా చేస్తానని హామీలిస్తున్న కేసీఆర్... కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా విమానాశ్రయాలు నిర్మిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. మాటలు తప్ప, సిద్ధాంతాలు లేని కేసీఆర్ లాంటి నేతల చేతిలో తెలంగాణను పెడితే... తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. బాధ్యత లేని నాయకులకు తెలంగాణను అప్పగిస్తే... ఈ ప్రాంతం మరో 20 ఏళ్లు వెనక్కు వెళుతుందని చెప్పారు.

More Telugu News