: అభివృద్ధి ఘనత మాదే: చంద్రబాబు

హైదరాబాద్ సహా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా తాము చేసిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ, కన్వెన్షన్ సెంటర్, నగరం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు తాము చేపట్టినవేనని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించడం తమ దూరదృష్టికి నిదర్శనమన్నారు. జాబు రావాలంటే ఇక్కడ టీడీపీ, కేంద్రంలో మోడీ రావాలని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నల్లగొండ జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు పెట్టించి బత్తాయికి గిట్టుబాటు ధర కల్పిస్తామని బాబు ప్రకటించారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని గతంలో తాను చెప్పిన మాటలే ఇప్పుడు నిజమయ్యాయన్నారు. తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని కాంగ్రెస్ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. తమ హయాంలో తెలంగాణలో అదనంగా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

More Telugu News