: పవన్ కల్యాణ్ జనసేన పోటీ చేస్తుంది... పీవీపీ నామినేషన్ ఖరారు

సినీ నటుడు పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా జనసేన అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా విజయవాడ లోక్ సభ స్థానానికి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు. పీవీపీతో పాటు మరో ఆరుగురు అభ్యర్థులను బరిలో దింపాలని జనసేన నిర్ణయించినట్టు సమాచారం.

పొట్లూరి వరప్రసాదుకు టీడీపీ, బీజేపీ కూటమి తరపున టికెట్ నిరాకరించిన నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా నిలబెట్టనున్నారు. ఈ మేరకు పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి, ఈ ఎన్నికల్లోనే ప్రజల ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు వారంతా 19వ తేదీన నామినేషన్లు వేయనున్నట్టు సమాచారం. దీనిపై పవన్ కల్యాణ్ నేడు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

కాగా, ఇప్పటికే టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇస్తున్న పవన్ కల్యాణ్, మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి జయప్రకాశ్ నారాయణకు కూడా మద్దతు ప్రకటించారు. మరోవైపు తన పార్టీ అభ్యర్థులను నేరుగా ఎన్నికల బరిలో నిలపనున్నారు. దీంతో సీమాంధ్రలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.

More Telugu News