: చక్రస్నాన మహోత్సవానికి భారీగా హాజరైన భక్తులు
భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరుగుతున్న వసంత నవమి మహోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గోదావరి తీరంలోని పునర్వసు మండపంలో శ్రీసీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సన్నిధి నుంచి బయల్దేరిన ఉత్సవ మూర్తులు, శ్రీ చక్రాన్ని మంగళవాయిద్యాల నడుమ గోదావరి తీరానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. పునర్వసు మండపంలో పంచ కలశాలతో పంచాభిషేకాన్ని గావించి శ్రీ చూర్ణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర పెరుమాళ్ ను స్నానానికి గౌతమీ నదీ తీరానికి తీసుకెళ్లారు. అక్కడ అశేష భక్తజనుల రామనామస్మరణల మధ్య స్వామివారికి శ్రీచక్రస్నానం ఘనంగా నిర్వహించారు. చక్రస్నాన ఘట్టం అనంతరం సీతారాములను భద్రాద్రి ఆలయ సన్నిధికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.