: టీ20 ఫైనల్స్ నేడే... అమీతుమీకి సిద్ధమైన భారత్, శ్రీలంక

బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మిర్పూర్ లో జరగనున్న ఫైనల్స్ లో భారత్, శ్రీలంకలు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగడంతో, టీంఇండియా ఆటగాళ్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ ను రెండోసారి ఎగరేసుకుపోవడానికి తహతహలాడుతున్నారు. మరో వైపు శ్రీలంక కూడా ఎలాగైనా టైటిల్ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. గెలుపుతో తమ స్టార్ బ్యాట్స్ మెన్ సంగక్కర, జయవర్ధనేలకు చిరస్మరణీయమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది.

టీంఇండియా జట్టులో కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడు. టోర్నీలో ఐదు మ్యాచుల్లో 242 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇతర బ్యాట్స్ మెన్ కూడా తమ సత్తా చాటారు. దీనికి తోడు భారత స్పిన్ విభాగం కూడా పటిష్ఠంగా ఉంది. దీంతో భారత్ కు విజయావకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. మరోవైపు, శ్రీలంకను తక్కువ చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు. ఒక ఓవర్ తోనే ఆటను మలుపు తిప్పగల బౌలర్ మలింగ్ వారికి కొండంత బలం. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. దూరదర్శన్, స్టార్ స్పోర్ట్స్ 1,3 చానళ్లలో ప్రత్యక్షప్రసారం అవుతుంది.

More Telugu News