: నాలో ఊపిరి ఉన్నంత వరకు 'మోతే' నా సొంత ఊరు: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో కట్టిన ముడుపును విప్పడానికి టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని మోతే గ్రామానికి వెళ్లారు. కేసీఆర్ రాకను పురస్కరించుకుని గ్రామస్థులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. బోనాలు, బతుకమ్మలతో గ్రామస్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య కేసీఆర్ ముడుపును విప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన గ్రామం మోతేనని చెప్పారు. ఈ గ్రామం ఎన్నో పల్లెలకు ఆదర్శంగా నిలిచిందని, ఉద్యమాన్ని గుండెలకు హత్తుకున్న గ్రామం మోతే అని ఆయన కొనియాడారు.

‘‘నేను బతికి ఉన్నంత కాలం మోతే నా స్వంత గ్రామం, మోతేలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. మోతేకు గోదావరి నీళ్లు తెప్పిస్తానని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని, రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ కి ఓటేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News