: టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకూడదని నిర్ణయించాం: కేసీఆర్

ఎట్టి పరిస్థితుల్లోను టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకూడదని నిర్ణయించినట్టు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఓ వాయిస్ ఉండాలనే విలీనం చేయడం లేదని, తమ ప్రతిపాదనలేవి కేంద్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పొత్తులపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు. కమిటీ సభ్యులుగా కేకే, ఈటెల, నాయిని, వినోద్, కడియం శ్రీహరిలను నియమించారు. తమకు చెప్పకుండానే టీఆర్ఎస్ సభ్యుల్ని కాంగ్రెస్ లో చేర్చుకున్నారని ఆయన ఆరోపించారు. పార్టీలోని అన్ని వర్గాలనుంచి విలీనంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. తెలంగాణకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైరాం రమేష్ హైదరాబాద్ వచ్చి టీఆర్ఎస్ ను విమర్శిస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తుందన్నారు.

ఇక తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, ఇప్పుడు రాజకీయ పార్టీ అని ఆయన తెలిపారు. సొనియా ఏనాడు పార్టీని విలీనం చేయాలని కోరలేదన్నారు. మధ్యలో ఉన్న వ్యక్తులు సోనియాగాంధీని తప్పుదోవ పట్టించారన్నారు. కాగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో గెలుపు బాధ్యతను హరీష్ రావు కు అప్పగించారు. ఈ ఎన్నికల్లో సీపీఐ, ఎంఐఎంతో పొత్తు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.

More Telugu News