: నిశ్శబ్దంగా పరీక్షించే సరికొత్త ఎమ్మారై వచ్చింది

మీరు ఎప్పుడైనా ఎమ్మారై తీస్తుండగా దగ్గరుండి చూశారా? ఆ సమయంలో విపరీతమైన శబ్దం, అంటే చిన్న స్థాయి విమానం వెళ్తున్నంత శబ్దం వస్తుంది. కానీ అసలు శబ్దమే చేయకుండా పరీక్ష చేసే ఎమ్మారై యంత్రాన్ని మొదటిసారిగా కేరళలోని కొచ్చిలో అమృతా ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. సైలెంట్ స్కాన్ టెక్నాలజీతో జీఈ కంపెనీ రూపొందించిన ఈ సరికొత్త ఎమ్మారై అమృతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఎంఎస్)లో ప్రత్యేకంగా నిలిచింది. సాధారణ ఎమ్మారై యంత్రం నుంచి 110 డెసిబుల్స్ శబ్దం వస్తుంది. ఇది బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు, లేదా విమానం ఇంజన్ ఆన్ అయి ఉన్నప్పుడు వచ్చే శబ్దానికి సమానం.

ఈ వినూత్న ఎమ్మారై యంత్రం అస్సలు శబ్దమన్నదే చేయకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుపోతుందని జీఈ హెల్త్ కేర్ ఎమ్మారై ఇమేజింగ్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ కార్తీక్ కుప్పుస్వామి తెలిపారు. ఎమ్మారై తీయించుకునేటప్పుడు రోగి కొద్దిగా కదిలినా, దాని రిపోర్టులో తేడా వస్తుంది. శబ్దం రావడం వల్ల రోగి అసౌకర్యానికి గురై, కదిలే అవకాశం ఉంది. అయితే, ఆ సమస్య ఇప్పుడు ఈ సరికొత్త ఎమ్మారైతో ఉండదని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త యంత్రాన్ని మెదడుతో పాటు కాలేయం స్కానింగుకూ వాడవచ్చని ఆయన చెప్పారు.

More Telugu News