: రాజధాని రేసులో దొనకొండ... నిలుస్తుందా?

రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కానుండటంతో, సీమాంధ్రకు రాజధానిగా ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని గుర్తిస్తుందన్న అంశం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే కొందరు నేతలు రెండు, మూడు పట్టణాల పేర్లు ప్రతిపాదించగా, తాజాగా దొనకొండ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండను రాజధానిగా చేస్తే బాగుంటుందని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు పలకల గనులు అందుబాటులో ఉండటంతో దొనకొండను రాజధానిగా చేస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన స్థలాలు దొనకొండ ప్రాంతంలో ఉన్నాయని రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ఢిల్లీకి పంపిన నివేదికలో తెలిపింది.

రాష్ట్రం ఏర్పడక ముందు దొనకొండ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. బ్రిటీష్ పాలనలో 1934లో దొనకొండ సమీపంలో 136 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించారు. యాభై ఏళ్ల క్రితం వరకు విమానాల రాకపోకలు జరిగాయి. ఇప్పుడా స్థలం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంది. అలాగే రైల్వే డివిజన్ అధీనంలో 140 ఎకరాల స్థలం ఉంది. దొనకొండ రైల్వేస్టేషన్ గుంతకల్ డివిజన్ లో ప్రాధాన్యత కలిగి ఉంది. దొనకొండ ప్రాంతంలో 35 వేల ఎకరాల సాగు భూమి ఉందని, సుమారు 34 వేల ఎకరాల అసైన్డ్ భూములున్నాయని ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది.

అక్కడ నుంచి శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, గుంటూరు, విజయవాడ, ఏలూరు, మార్కాపురం, నంద్యాలకు రైలు మార్గం ఉంది. కర్నూలు మీదుగా హైదరాబాదుకు కూడా రైలు మార్గం ఉంది. ఇక, రోడ్డు మార్గానికొస్తే... జిల్లా కేంద్రమైన ఒంగోలుకు దొనకొండ 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు నుంచి నంద్యాల వెళ్లే రాష్ట్ర రహదారి దొనకొండ దగ్గర్లోనే ఉంది. దొనకొండకు 22 కిలోమీటర్ల దూరంలో మార్కాపురం పట్టణం ఉంది. మార్కాపురం అంతర్జాతీయంగా పలకల ఉత్పత్తితో పేరొందిన విషయం విదితమే.

దొనకొండ సమీపంలో తగినంత అటవీ భూమి ఉంది. కంభం నుంచి పొదిలి వరకు సుమారు 1.35 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. మేకలవారిపల్లె, గానులపెంట, కొనకనమిట్ట తదితర ప్రాంతాల్లో అటవీ భూముల్లో ఎక్కువగా చిల్ల చెట్లు ఉన్నాయి. మార్కాపురం నుంచి దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు అటవీ ప్రాంతంలో సుమారు లక్ష ఎకరాలకు పైగా అటవీ భూమి ఉంది. మార్కాపురం మండలంలో 15 కిలోమీటర్లలో పలకల గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు పలకల గనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో చీమకుర్తి గ్రానైట్ గనులున్నాయి.

దొనకొండకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు తక్కువ. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రైల్వే, రోడ్డు మార్గాలుండటంతో రాజధానికి అనువుగా ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు రేసులో దొనకొండ నిలిచే అవకాశాలు ఎక్కువగానే కన్పిస్తున్నాయి.

More Telugu News