: ఏ పురస్కారమైనా సచిన్ ఘనతకు సరిరాదంటున్న బాలీవుడ్
మహోన్నత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న స్వీకరించడం పట్ల బాలీవుడ్ వర్గాలు స్పందించాయి. ఎంతటి పురస్కారమైనా సచిన్ ఘనతకు సరిరాదని పలువురు సెలబ్రిటీలు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సచిన్ నేడు భారతరత్న అందుకున్నాడు. దీనిపై ట్విట్టర్లో దీపికా పదుకొనే వ్యాఖ్యానిస్తూ, 'సచిన్ ఈ పురస్కారానికి నిస్సందేహంగా అర్హుడే. అతనో లెజెండ్. అన్నింటికి మించి ఓ బ్రాండ్' అని పేర్కొంది. ఇక రణ్ వీర్ సింగ్ అయితే, సచిన్ కోసం మరో అవార్డు సృష్టించాల్సి ఉంటుందని ట్వీట్ చేశాడు. కోట్లాది అభిమానులను గర్వించేలా చేసిన సచిన్ కు భారతరత్న లభించడం ఆనందదాయకం అని జుహీ చావ్లా, సచిన్ కు ఎన్ని అవార్డులు లభించాయన్నది పెద్ద విషయమే కాదని దియా మీర్జా వ్యాఖ్యానించారు.