: అవకాశవాద రాజకీయాలకు కాదు.. ఆదర్శాలకు కట్టుబడాలి: వెంకయ్య నాయుడు
దేశంలో అవకాశవాద రాజకీయాలకు కాదు.. ఆదర్శాలకు కట్టుబడినది భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. బీజేపీలో అటల్ బిహారీ వాజ్ పేయి నుంచి అరుణ్ జైట్లీ వరకు అనేక మంది సీనియర్ నాయకులు పార్టీ తరఫున పనిచేస్తూ, దేశ ప్రజలకు సేవ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 'బీజేపీ వ్యక్తి కోసం పనిచేసే పార్టీ కాదు.. వ్యవస్థ కోసం పనిచేసే పార్టీ' అని ఆయన చెప్పుకొచ్చారు. 'కాంగ్రెస్సే వ్యక్తి చుట్టూ తిరిగే పార్టీ' అని రాహుల్ గాంధీ గ్రహించాలని ఆయన హితవు పలికారు. మోడీని విమర్శించే ముందు.. కాంగ్రెస్ అంతర్గత లోపాలను సరిచేసుకోవాలని ఆయన చెప్పారు. గట్టి నాయకుడు లేని ప్రభుత్వం మనలేదని వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేందుకు కావలసిన పూర్తి మెజారిటీని అందించాలని ఆయన ప్రజలను కోరారు. దేశంలోని అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఉందని, అందుకే నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని ఆయన అన్నారు.