: ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి అవుతా: జేపీ

లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తన మనసులో మాట బయటపెట్టారు. రాష్ట్ర ప్రజలు కోరుకుని ఆదరిస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని అన్నారు. కుటుంబ పాలన నుంచి దేశ ప్రజలకు విముక్తి కావాలని, కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడి ప్రజలకు పరిష్కారం చూపెడదామని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయన్న జేపీ... కాంగ్రెస్ ఐదు తరాల నుంచి ఉన్న పార్టీ అని గుర్తు చేశారు. కాగా, దేశంలో నల్లధనం భయంకరంగా రాజ్యమేలుతోందని... నల్లడబ్బు, దొంగడబ్బుతో ఎన్నికలను నిజాయతీగా ఎలా జరుపుతారని, మంచి రాజకీయాలు ఎలా తెస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.

సాంకేతికత పెరిగిన తర్వాత ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. పార్టీలకు నిజాయతీగా విరాళాలు ఇచ్చే వ్యక్తులు కరవయ్యారన్నారు. అయితే, తమ పార్టీ వెబ్ సైట్ ద్వారా మూడు రోజుల్లో మూడు లక్షలు సేకరించినట్లు తెలిపారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు మరో రూ.3 కోట్లను సమకూర్చేందుకు ముందుకొస్తున్నారని వివరించారు. తెలంగాణా బిల్లును ఎదుర్కోవడంలో లోక్ సత్తా భయపడదని జేపీ చెప్పారు.

More Telugu News