: సఫారీలను ఆటాడుకున్న పుజారా, కోహ్లీ

సౌతాఫ్రికాలో జరుగుతున్న మొదటి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా యువ జట్టు విదేశాల్లో సాధికారతతో ఆడుతోంది. బౌలర్లు, బ్యాట్స్ మన్ లు సమర్థవంతంగా ఆడుతూ పైచేయి సాధించారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అండతో నయా డిపెండబుల్ పుజారా సఫారీ బౌలర్లను ఆడుకున్నాడు. ఛటేశ్వర్ పుజారా(135), విరాట్ కోహ్లీ(77)లు సఫారీ బౌలర్లకు సవాల్ విసిరారు. ప్రపంచంలోనే అత్యత్తమ బౌలర్లుగా కితాబులు అందుకున్న స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్ లను ఏమాత్రం లెక్క చేయకుండా బంతిని ఉతికేశారు. గ్రౌండ్ నలువైపులా షాట్లు కొడుతూ టీమిండియా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భరోసా కల్పించారు. వీరిద్దరూ భారత జట్టు దిగ్గజాలు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ ల లోటు కనబడనీయకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

భారత్ రెండో ఇన్నింగ్స్ ను కూడా తొలి ఇన్నింగ్స్ లానే ఆరంభించింది. ఓపెనర్లు ధావన్(15), విజయ్(39) మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. తరువాత బరిలోకి దిగిన పుజారా, కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడి భారత్ కు 320 పరుగుల ఆధిక్యాన్నిచ్చారు. ఈ క్రమంలో మోర్నీ మోర్కెల్ గాయపడి ఆటకు దూరమయ్యాడు. ఈ రోజు వీలైనంత తొందరగా ఇన్నింగ్స్ ముగించి సౌతాఫ్రికాపై తొలి విజయం సాధించేందుకు భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.

More Telugu News