: మీ గుండెను ఇలా కాపాడుకోండి

మీ గుండెను భద్రంగా కాపాడుకోవాలనుకుంటే మీరు చక్కగా రోజుకు ఒక ఆపిల్‌ని తింటూవుంటే చాలు. మీ గుండె భద్రంగా, సురక్షితంగా ఉంటుందట. రోజుకు ఒక ఆపిల్‌ పండు తింటే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చని 150 ఏళ్ల క్రితం నుండి బాగా వాడుకలో ఉన్న సామెత ఒకటి ఉంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో రోజూ ఒక ఆపిల్‌ పండు తినడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి దూరంగా ఉండవచ్చని తేలింది.

ఈ వ్యాధుల నివారణకు యాభై ఏళ్లు పైబడిన వృద్ధులు రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందుల(స్టాటిన్స్‌)ను వాడుతుంటారు. అలా ఈ మందులను వాడని వారికి వారి ఆహారంలో ఆపిల్‌ను చేర్చి పరిశోధకులు పరీక్షించారు. ఆ తర్వాత వారిని పరిశీలించినప్పుడు స్టాటిన్స్‌ వాడుతున్న వారితో పోల్చితే ఆపిల్స్‌ తిన్న వృద్దుల్లో గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే స్టాటిన్స్‌ను ఎక్కువగా వాడడం వల్ల దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వయసు పెరిగిన వారే కాదు... అందరూ కూడా చక్కగా రోజుకు ఒక ఆపిల్‌ పండును లాగించేయండి. ఆరోగ్యంగా ఉండండి మరి!

More Telugu News