: నాలుగు రాష్ట్రాల ఫలితాలతో నిరాశ చెందకండి: సోనియాగాంధీ
ఇటీవలి నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ డీలా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రయత్నించారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలతో నిరాశ చెందరాదని... ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని ముందుకు వెళదామని సూచించారు. పార్లమెంటులో మహిళా బిల్లును ఇప్పటి వరకు ఆమోదింపజేసుకోలేక పోయాయని... ఇది చాలా వెలితిగా ఉందని అన్నారు. పార్టీలోని నాయకుల మధ్య సఖ్యత కొరవడిందని... అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ, కొన్ని పార్టీలు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నాయని... అలాంటి హామీలను తాము ఇవ్వలేమని తెలిపారు.