: ఈ బొమ్మకు వేల ఏళ్లు

రెండు వేల ఏళ్ల క్రితం ఎలాంటి నాగరికత ఉండేదో ... సరిగ్గా ఊహించలేము. కానీ ఆ కాలంలో కూడా చక్కగా బొమ్మలను తయారుచేసేవారు. ఎందుకంటే, పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన వస్తువులను గమనిస్తే ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే. ఆ కాలంలో చక్కగా పిల్లలకు పాలుపట్టేలాగా ఉన్న ఒక రకమైన మట్టి బొమ్మ పురావస్తు పరిశోధకులకు లభ్యమయ్యింది. వుగ్లియాలోని టోరంటోకు సమీపంలో మండూరియా ప్రాంతంలో భవన నిర్మాణానికి తవ్వకాలు జరుపుతుండగా అక్కడ ఒక మెనప్పియన్‌ సమాధి బయటపడింది. 2,400 ఏళ్ల క్రితం కాలానికి చెందిన ఈ సమాధిలో రెండు అస్థిపంజరాలతోబాటు పలు అరుదైన వస్తువులు బయల్పడ్డాయి.

ఈ సమాధిలో జగ్గులు, పళ్లాలు, దీపపు ప్రమిదలు, పిల్లలకు పాలు పట్టే సీసాలు, నలుపు రంగు వేసిన పాత్ర, కత్తికి సంబంధించిన ఇనుప బ్లేడు లభించాయి. వాటితోబాటు పందిపిల్ల ఆకారంలో ఉన్న ఒక బొమ్మ కూడా లభించింది. ఇది పిల్లలకు పాలు పట్టే సీసాకు రెట్టింపు పరిమాణంలో ఉంది. దీనికి చెవులు, కళ్లు ఉండడంతోబాటు బొమ్మ మధ్యభాగంలో చిన్నపిల్లలు పట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలా హ్యాండిల్‌ కూడా ఉంది.

మెనప్పియన్‌ ప్రజలు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరంలో ఇల్లీరియా నుండి వలస వచ్చి ఆగ్నేయ ఇటలీ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆ తెగకు సంబంధించినదే ఈ సమాధిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇందులోని రెండు మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలవిగా పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే అందులో లభించిన వస్తువుల ఆధారంగా వీరు క్రీస్తు పూర్వం 400 లేదా 300 సంవత్సరాల కాలానికి చెందినవారు కావచ్చని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News