: బ్లూటూత్‌, వై-ఫై లేకున్నా పరవాలేదు!

మీరు మీ పక్కనే ఉన్న స్నేహితుల నుండి మీకు కావలసిన సమాచారాన్ని పంపించుకోవాలంటే ఎక్కువగా బ్లూటూత్‌ని ఉపయోగిస్తారు. అలాగే దూరంగా ఉండేవారినుండి సమాచారాన్ని పొందాలంటే వై-ఫైని ఉపయోగిస్తారు. అలాకాకుండా ఈ రెండింటి అవసరం లేకుండా, కేవలం మీరు తాకితే చాలు చక్కగా సమాచారం ఒక ఫోన్‌నుండి మరో ఫోన్‌లోకి వెళ్ళిపోయే సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరిజ్ఞానంతో మనం మన ఫోన్‌లో బ్లూటూత్‌ ఆన్‌ చేయాల్సిన అవసరం లేకుండానే, వై-ఫై ఆన్‌ చేయకుండానే చక్కగా ఫైళ్లను పంపవచ్చని చెబుతున్నారు.

మీ టచ్‌స్క్రీన్‌ ఫోన్‌ తెరపై మీరు మీ వేలితో, లేదా చేతితో తాకితే చాలు మీరు పంపాలనుకున్న ఫైల్‌ ఎవరికి చేరాలో వారికి చేరిపోతుంది. ఇలాంటి ఒక సరికొత్త 'ఇన్‌టచ్‌' టెక్నాలజీని ఫిన్లాండ్‌కు చెందిన 'వీటీటీ టెక్నికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌'కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ఇన్‌టచ్‌ కోసం మనం ఉత్తి చేతివేలును ఉపయోగిస్తే సరిపోదు. ఇలా ఫైళ్లను పంపాలంటే మన చేతికి ఉండే ఉంగరం, గోరుపై పెట్టుకునే ఒక ఆభరణం, బ్రాస్‌లెట్‌ వంటి వాటిని ఫైళ్లను ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి వినియోగిస్తారట. ఈ టెక్నాలజీ ద్వారా సులభంగా ఫైళ్లను స్మార్ట్‌ఫోన్లు, ఇతర స్మార్ట్‌ పరికరాల మధ్య పంపుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పేటెంట్‌ను పొందేందుకు వేచిచూస్తున్న ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

More Telugu News