: కన్నతల్లిని కాలువలోకి తోసి కడతేర్చిన కసాయి

కన్నతల్లిని కాలువలోకి తోసి ఆమె మరణానికి కారణమయ్యాడు ఓ పుత్రరత్నం. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామానికి చెందిన గౌసియా బేగం(65) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దీంతో ఒక్కొక్కరి వద్ద 20 రోజుల వంతున ఉంటూ జీవనం సాగిస్తోంది. మానికొండ గ్రామంలో చెల్లెలి వద్ద ఉన్న తల్లిని, తన వంతు రావడంతో పెద్ద కుమారుడు కరీముల్లా ఆమెను ఆటోలో తాడిగడప తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి పెనమలూరులో అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్లాడు.

తల్లిని అక్కడ ఉంచేందుకు ఇంటి యజమాని అంగీకరించకపోవడంతో తిరిగి ఆటోలో వెంట్రప్రగడలోని తమ్ముడి ఇంటికి బయలుదేరి కోమటిగుంట లాకు వద్ద తల్లితో పాటు దిగిపోయాడు. లాకు వంతెనపై నుంచి ఆమెను కాలువలోకి తోసేశాడు. ఇంటికి వెళ్లి బంధువులకు విషయం చెప్పాడు. కాగా శుక్రవారం ఉదయం తల్లి మృతదేహం దొరికింది. ఈ ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసి, కరీముల్లాను అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఆర్ధిక బాధలు, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసి తట్టుకోలేక మనసు చంపుకుని తల్లిని కాలువలోకి తోసి ఆమె మరణానికి కారణమయ్యానని కరీముల్లా రోదిస్తూ చెప్పాడు.

More Telugu News