: కాంగ్రెస్ పై అశోక్ బాబు వ్యాఖ్యలు
రెండు నెలల అనంతరం తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఏపీఎన్జీవోలు నేడు గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందని దుయ్యబట్టారు. అదే క్రమంలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం కోసమే విభజన నిర్ణయం చేసిందని విమర్శించారు. ఎవరో లేఖరాసి ఇస్తే పార్టీ ఆఫీసులో కూర్చొని విభజన చేస్తారా? అని నిలదీశారు. విభజన విషయంలో ముందుకు వెళతామని షిండే, దిగ్విజయ్, చాకో రోజూ చెబుతూనే ఉన్నారన్న అశోక్ బాబు.. తెలంగాణ నేతలు అధికారం కోరుకుంటున్నారా?.. అభివృద్ధిని కోరుకుంటున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ రాజధాని కనుకే అన్ని ప్రాంతాల వారు అక్కడికి వెళుతున్నారని, నగర అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజల కృషి ఉందని చెప్పుకొచ్చారు. కాబట్టి, తెలంగాణ, ఆంధ్ర అని ఎవరూ వేరుచేసి మాట్లాడవద్దని సూచించారు. తమ సమ్మె విరమణ తుపాను ముందు నిశ్శబ్దంలాంటిదేనని వెల్లడించారు.