: మీ పిల్లలతో ఇలా ఉండకూడదట!

మీ పిల్లలు ఒక వయసు వరకూ మీ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. తర్వాత వయసు పెరిగేకొద్దీ మీకు దూరం జరుగుతుంటారు. ఈ విషయం చాలామంది తల్లిదండ్రుల్లో బాధకలిగిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న వయసులో తల్లికొంగు పట్టుకునే తిరుగుతుంటారు. పెద్దయ్యాక అదే అమ్మాయిలు కొందరు చెడు మార్గాలవైపు పయనిస్తుంటారు. దీనికి కారణం ఆడపిల్లలతో తల్లిదండ్రులు మెలిగే విధానమేనని నిపుణులు చెబుతున్నారు. మన బిడ్డలే కదా అని వారికి విపరీతమైన స్వేచ్ఛనివ్వడం, అలాగే కన్నబిడ్డలను తరచూ విమర్శించడం వంటి కారణాలవల్ల పిల్లలు చెడు మార్గాలను అనుసరిస్తున్నట్టు ఒక సర్వేలో తేలింది.

ముఖ్యంగా ఆడపిల్లలు ఇలా చెడుమార్గాల్లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. దీనికి కారణం తల్లిదండ్రులు తరచూ ఘర్షణకు దిగుతుండడం, ఈ కారణం వల్ల పిల్లలపై ప్రేమ చూపకపోవడంతో తమను ప్రేమగా లాలించేవారికోసం ఆడపిల్లలు ఎదురుచూస్తుంటారట. వారి అన్వేషణలో స్నేహితులను వెదుకుతూ చివరికి ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారట. అలాగే పిల్లలతో గడిపే సమయం కూడా రానురాను తగ్గిపోతోందట. గతంలో స్కూల్‌నుండి ఇంటికి వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు చక్కగా మాట్లాడుతూ కాలక్షేపం చేసేవారు. దీంతో వారికి ఒంటరితనం అనే భావన కలిగేదికాదు.

కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు, తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లడం, ఇంట్లో పెద్దవారు ఎవరూ లేకపోవడం వంటి కారణాలవల్ల ఆడపిల్లలు చిన్న వయసులోనే ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నారట. ఒకవేళ తల్లిదండ్రులతో సమయం గడిపే అవకాశం దొరికినా అది కూడా టీవీ చూడడానికే సరిపోతోందని ఈ సర్వేలో తేలింది. ఆడపిల్లలతో తల్లిదండ్రులు చక్కగా మనసువిప్పి మాట్లాడడం వల్ల వారిలో ఒంటరితనం దూరం చేయవచ్చు.

వారితో గడిపే సమయం తగ్గిపోవడం వల్ల వారు తమతో మాట్లాడే వ్యక్తిని అన్వేషిస్తూ, ఎవరినో ఒకరిని ఎంచుకుని, వారితో స్నేహం చేసి అది ప్రేమగా మారి చివరికి ఎదురుదెబ్బ తినడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ, వారితో ఆప్యాయంగా మాట్లాడడం వంటివి చేయడం వల్ల వారిని మీ ప్రేమబంధంతో కట్టేయవచ్చు. వారు చెడు మార్గాలు పట్టకుండా అడ్డుకోవచ్చు.

More Telugu News