: ఎండతో ఎంతో మేలు

మన ఇళ్లలోని మహిళల్లో ఇప్పుడు ప్రధానమైన సమస్య డి విటమిన్‌ లోపం. సాధారణంగా అమ్మాయిలు ఎండలో ఎక్కువగా తిరగడానికి ఇష్టపడరు. సూర్యరశ్మి కారణంగా శరీరం నల్లబడుతుందని చాలామంది భయపడుతుంటారు. అయితే సూర్యరశ్మి సోకని కారణంగా వారు డి విటమిన్‌ లోపంతో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి రోజూ కాసేపు ఎండలో ఉంటే తద్వారా సూర్యరశ్మి శరీరానికి సోకి, డి విటమిన్‌ శరీరానికి అందుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పుడు ఎక్కువగా మహిళలు ఎండలో తిరగకుండా ఇంట్లోనే కూర్చునేందుకు ఇష్టపడుతున్నారు. ఉద్యోగాలు చేసే ఆడవారు కూడా ఏసీ గదుల్లో ఉండేవారు, లేదా ఆఫీసు కార్యాలయాల్లోనే ఎక్కువగా గడిపేవారే. వీరు బయటికి రావడం అనేది సూర్యుడు అస్తమించిన తర్వాతనే. ఇలాంటి వాళ్లకు డి విటమిన్‌ కచ్చితంగా లోపిస్తుంది. దీని కారణంగా పలు రకాలైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలాంటివి నివారించడానికి సూర్యరశ్మిలో కాసేపు ఉండడం లేదా మనం పనిచేసే సమయంలో కనీసం కిటికీ దగ్గర కూర్చోవడం వంటివి చేయాలని, ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలని పరిశోధకులు చెబుతున్నారు. సూర్యరశ్మిలోని డి విటమిన్‌ శరీరానికి చేరడం వల్ల పళ్ల చిగుళ్లు గట్టిపడతాయని, అలాగే కళ్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని, కళ్లు కాంతిమంతమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, వారంలో కనీసం 21 గంటలపాటు ఎండ వేడిమి తగిలే మహిళలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా తక్కువేనట.

టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఎండవేడిమి తగలడం వల్ల మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని తేలింది. అలాగే చికాగోలోని నార్త్‌ వెస్టర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో సూర్యుని వెలుతురు తగిలేలా కిటికీ దగ్గర కూర్చునే ఉద్యోగినులు, లేదా పెద్ద గాజు చాంబర్‌లో ఉండి పనిచేసే ఉద్యోగినుల జీవన నాణ్యత మెరుగ్గా ఉంటుందని తేలింది. ఇలాంటివారిలో బద్దకం, నిద్రలేమి, మందకొడిగా ఉండడం వంటి సమస్యలు తక్కువగా ఉంటున్నాయని, ముఖం కూడా చురుగ్గా, కళకళలాడుతూ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి చక్కగా కాసేపు ఎండని ఆస్వాదించండి, అందాన్ని, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

More Telugu News