: చెన్నై సూపర్ కింగ్స్ కు ఝలక్.. ఫైనల్లో రాయల్స్

చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ సెమీఫైనల్ మెట్టుపై చతికిలబడింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన సెమీస్ సమరంలో చెన్నై 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గతరాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేశారు. ఓపెనర్ రహానే 56 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 70 పరుగులు చేశాడు. అనంతరం లక్ష్యఛేదనలో టాపార్డర్ వైఫల్యంతో చెన్నైకి పరాజయం తప్పలేదు. ధోనీ (3), జడేజా (2) తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో అశ్విన్ (28 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సులు) పోరాడినా ఫలితం దక్కలేదు. ఓవర్లన్నీ ఆడిన ఐపీఎల్ చాంపియన్ 8 వికెట్లకు 145 పరుగులే చేసింది.

41 ఏళ్ళ వెటరన్ లెగ్ బ్రేక్ బౌలర్ ప్రవీణ్ తంబే 3 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజా విజయంతో గత ఐపీఎల్ ఫైనల్లో చెన్నై చేతిలో ఎదురైన పరాజయానికి రాయల్స్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. కాగా, నేడు జరిగే ముంబయి ఇండియన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో రాయల్స్ టైటిల్ పోరులో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ రేపు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనుంది.

More Telugu News