: అందరూ నాటకమాడుతున్నారు: చంద్రబాబు

రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్, జగన్ అందరూ కలిసి నాటకాలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వీరందరూ ఇలా డ్రామాలాడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ ప్రేక్షకుడిలా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఈ సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఇంకా సమయం సరిపోలేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో స్క్రిప్టు రాసుకుని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకే మ్యాచ్ ఫిక్సింగ్ అని విమర్శించారు.

ఎన్నికలకు ముందో తర్వాతో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ లో కలిసిపోతుందని జోస్యం చెప్పారు. యూపీఏతో పొత్తు పెట్టుకుంటామని జగన్ కుటుంబసభ్యులు పదులసార్లు చెప్పారని బాబు ఆరోపించారు. 30వేల పేజీలు,10 చార్జిషీట్లతో సీబీఐ జగన్ అక్రమాలను కళ్ళకుకట్టినా ఫలితం శూన్యమని అభిప్రాయపడ్డారు. జగన్ ఇప్పుడు నీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అభివర్ణించారు. దేశంలో న్యాయం, ధర్మం బతికే ఉన్నాయి కానీ, అవి ఉనికిని చాటుకునే సరికి ఆలస్యం అవుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

More Telugu News