: ముసలితనాన్ని తరిమేయవచ్చు!!

శరీరంలో వార్ధక్య ఛాయలను వెంటనే ఎత్తిచూపేది చర్మం. దీంతో చర్మంపై ముడతలను తగ్గించుకోవడానికి చాలామంది నానా తంటాలు పడుతుంటారు. ఎవరికైనా తాము యవ్వనవంతులుగానే కనబడాలనే కోరిక ఉంటుంది. దీంతో రకరకాల క్రీములను రాసుకుంటూ చర్మంపై ముడతలు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా చర్మంపై వార్ధక్య చిహ్నాలైన ముడతలను కనబడకుండా చేసే ఒక సరికొత్త మందును శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ మందు వయసు పరుగును ఆపలేదుగానీ... వయసు ప్రభావం వల్ల చర్మంపై వచ్చే ముడతలను మాత్రం కనపడకుండా చేస్తుందని చెబుతున్నారు.

చర్మంపై ముడతలను నివారించడానికి ఇప్పటికే బొటాక్స్‌ వంటివి ఉపయోగిస్తున్నారు. తాజాగా పూర్తిగా మొక్కలనుండి తీసిన పదార్ధాలతో ఒక మందు గుళికను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ గుళిక బొటాక్స్‌కు ప్రత్యామ్నాయం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ మందును జర్మనీలోని కొందరు మహిళలపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వారి చర్మంపై ముడతలను దాదాపుగా పది శాతం తగ్గించడంతో ఈ మందు బాగా పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇందులో విటమిన్‌-సి, ఇ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ సుగుణాలు పుష్కలంగా ఉండడంతో ఈ మాత్రను మింగిన వారిలో చర్మం ముడతలు తగ్గడం స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. ఈ మందు చర్మంలోని కొలాజెన్‌ ఉత్పత్తికి మంచి ఉత్ప్రేరకంగా పనిచేసిందని, కొలాజెన్‌ చర్మంపై ముడతలు ఏర్పడకుండా నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News