: మగవారికే మరపెక్కువట!

ఆడవారితో పోల్చుకుంటే మగవారికే మతిమరుపు ఎక్కువగా ఉంటుందట. వారికి తమ భాగస్వామి పుట్టినరోజు, తమ పెళ్లిరోజును కూడా గుర్తుపెట్టుకోవడంలో విఫలమవుతుంటారట. ఈ విషయం తాజా పరిశోధనలో తేలింది. సాధారణంగా మనలో చాలామంది కొన్ని విషయాలు మరచిపోతుంటారు. ఉదాహరణకు తలుపుకు గొళ్లెం పెడతారు. కానీ తాళాన్ని లోపలే మరిచిపోతారు. అలాగే బజారుకెళ్లిన తర్వాత ఇంట్లో బజారునుండి ఏం తెమ్మన్నారనే విషయాన్ని మరిచిపోతుంటారు. గదిలోకి ఏదైనా పనిగా వచ్చిన తర్వాత ఎందుకొచ్చామో చప్పున గుర్తుకురాదు. ఈ విషయంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు మనిషి రోజుకు నాలుగు విషయాలనైనా మరిచిపోతుంటారని గుర్తించారు.

యూకేలో నిర్వహించిన ఈ పరిశోధనలో మనిషిని ఏడాదికి సుమారు 1460 సార్లు మరుపు సమస్య వేధిస్తున్నట్టు తేలింది. ఇలా మనం మరిచిపోయే విషయాల్లో సాధారణంగా తాళాలు, ఫోన్‌, పర్సు ఎక్కువగా ఉంటాయట. పురుషులైతే మరీ తమ భార్యల పుట్టినరోజును, తమ పెళ్లిరోజును కూడా మరిచిపోతుంటారట. దీనికి కారణం క్షణం తీరికలేని జీవనశైలి, పనిభారం, ఆర్ధిక ఒత్తిళ్లు, భయాలు వంటివేనని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News