: ఇలాంటి మహిళలే ఊబకాయం బారినపడుతుంటారు

ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ, మరోవైపు ఇంటిలో మళ్లీ గృహిణిగా బాధ్యతలను నిర్వహిస్తూ రెండు పనులను చూస్తూ ముందుకు సాగే మగువలతో పోలిస్తే, ఇంటిపట్టునే ఉంటూ ఇల్లాలి బాధ్యతలను నిర్వహించేవారే ఎక్కువ అనారోగ్యం పాలవుతుంటారని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే ఉద్యోగినులతో పోలిస్తే గృహిణులే ఊబకాయం బారిన పడతారని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. సహజంగా అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు ఇంటి బాధ్యతలను రెండింటిని నిర్వహించే ఆడవారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారని, ఈ కారణంగా వారు త్వరగానే అనారోగ్యానికి గురవుతుంటారనే అభిప్రాయం ఎక్కువగా ఉండేది. అయితే ఒకవైపు గృహిణిగా, మరోవైపు పిల్లలకు తల్లిగా, ఇంకోవైపు ఉద్యోగినిగా తన బాధ్యతలను నిర్వహిస్తూ జీవితంలో త్రిపాత్రాభినయం చేసే ఆడవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారట.

సాస్కాచ్‌వాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఇలా మూడు బాధ్యతలను నిర్వహించే మహిళలే ఇంటిపట్టున ఉండేవారికన్నా కూడా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని తేలింది. ఉద్యోగినులైన మహిళలకు ఎంఫీసీమా వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, గుండెజబ్బులు వంటివి వచ్చే ప్రమాదం కూడా తక్కువగానే ఉంటుందని తేలింది. అలాగే అలర్జీలు, మైగ్రెయిన్‌ తలనొప్పి, అల్సర్లు వంటివి కూడా వీరిలో తక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలింది.

బ్రిటన్‌లో నిర్వహించిన మరో అధ్యయనంలో తమ యాభయ్యవ ఏట ఊబకాయం బారిన పడుతున్న వారిలో ఉద్యోగినులకంటే గృహిణులే ఎక్కువశాతం మంది ఉంటున్నారని తేలింది. గృహిణులు 38 శాతం ఇలా ఊబకాయం బారిన పడుతుంటే ఉద్యోగినులు కేవలం 23 శాతం మాత్రమే ఉన్నారట. అయితే ఎవరికైనా కుటుంబ సభ్యుల సహకారం ఉంటే చక్కగా ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News