: బీసీసీఐ విచారణ కమిటీ చట్టవిరుద్ధం: బోంబే హైకోర్టు

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఏమీ లేదంటూ తేల్చిన బీసీసీఐ ద్విసభ్య కమిటీకి చట్టబద్ధత లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ ను దర్యాప్తు చేయడానికి వీలుగా బీసీసీఐ తాజాగా మరో కమిటీని ఏర్పాటు చేయాలని బోంబే హైకోర్టు ఈ రోజు ఆదేశించింది. సాక్ష్యాల సేకరణలో అసమానతలు ఉన్నాయని అభిప్రాయపడింది. మళ్లీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న శ్రీనివాసన్ కు తాజా తీర్పు శరాఘాతమే.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ మేనల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సీఈఓ గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రా ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కు పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బీహార్, జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన బోంబే హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలపై బీసీసీఐ సుప్రీంకోర్టుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

More Telugu News