: శభాష్ కోహ్లీ.. సిరీస్ మనదే
జింబాబ్వే గడ్డపై వరుసబెట్టి మూడు వన్డేలలోనూ ఆతిథ్య జట్టును చిత్తు చేసి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా.. సిరీస్ ను 3-0తో కైవసం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో ఇక మిగిలి ఉన్నది రెండే వన్డేలు. నిన్న హరారేలో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వేను భారత బౌలర్లు అమిత్ మిశ్రా 4 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు తీసుకుని కట్టడి చేశారు. దీంతో జింబాబ్వే 183 పరుగులకే ఆలౌట్ అయింది. 184 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. కోహ్లీ 68(నాటౌట్) పరుగులతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఓపెనర్ ధావన్ 35, రాయుడు 33 పరుగులతో తమవంతు సహకారం అందించారు. దీంతో భారత్ 35.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం ఖరారు చేసుకుంది. 4 వికెట్లు తీసి జింబాబ్వే నడ్డి విరిచిన అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.