: ఢిల్లీలో రూ.5కే భోజనం.. ముంబైలో మీల్స్ 12 రూపాయలే: రాజ్ బబ్బర్

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారిపై విడుదల చేసిన లెక్కలపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 5 రూపాయలకే ఆహారం లభిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ బబ్బర్ అన్నారు. ఆర్ధిక రాజధాని ముంబైలో 12 రూపాయలకే చాలినంత భోజనం తినొచ్చని తెలిపారు. ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతంలో 5 రూపాయలకే ఆహారం తినొచ్చని కాంగ్రెస్ నేత రషీద్ మసూద్ మీడియాతో అన్నారు. వీరి వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.

ఢిల్లీలో ఒక్క జామా మసీద్ ప్రాంతంలోనే అందరు పేదలూ ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ముంబైలో పానీ పూరీకే 25 రూపాయలు పెట్టాల్సి వస్తోందని, ఎవరు 12 రూపాయలకు భోజనమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఏసీల్లో కూర్చుని లెక్కలు తయారు చేస్తారని, కేజీ బియ్యం రేటెంతో వారికి తెలీదని మేధావులు మండి పడుతున్నారు. బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ కేంద్రం దారిద్ర్యరేఖ విషయంలో సంతోషంగా ఉందన్నారు. వారు ఆ రేఖను కుంచింపజేసి ప్రజలను పేదరికం నుంచి బయట వేయాలని చూస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు.

మరో సీనియర్ నాయకురాలు మీనాక్షీ లేకి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల దృష్టిని ప్రస్తుత అవినీతి వంటి అంశాల నుంచి మరలించడానికి ఈ రకమైన లెక్కలు వేసి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీపీఐ నాయకులు అతుల్ అంజన్ మాట్లాడుతూ రాజ్ బబ్బర్ కు సినిమా డైలాగులు చెప్పే అలవాటు ఇంకా పోలేదని, స్క్రిప్టు, డైలాగులు సోనియా, మన్మోహన్ ఇస్తే వాటిని ఆయన వల్లే వేస్తాడని అన్నారు.

More Telugu News