: కాలికట్ వర్శిటీలో పాఠ్యాంశంగా అల్ ఖైదా నేత కవిత

కాలికట్ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాల్లో అల్ ఖైదా నేత రాసిన కవిత చోటు చేసుకోవడం వివాదాస్పదమైంది. నిషిద్ధ అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన ఇబ్రహీం అల్ రుబాయిష్ ఈ కవితను సృజించాడు. అమెరికా నిర్వహించే గ్వాంటనామో బే జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో రుబాయిష్ తన ఆలోచనలను అక్షరబద్ధం చేశాడు. 'ఓడ్ టు ద సీ (సముద్రానికి నివేదన)' పేరిట రాసిన ఈ గీతం ఇప్పుడు కాలికట్ వర్శిటీ సిలబస్ లో కనిపించడం పట్ల కేరళలో నిరసనలు మిన్నంటుతున్నాయి. తక్షణమే ఈ దుష్ట సాహిత్యాన్ని పాఠ్య పుస్తకాల్లోంచి తొలగించాలని బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కోసం వేట సాగిస్తున్న సమయంలో.. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో అమెరికా దళాలకు పట్టుబడ్డ రుబాయిష్ తొలుత కొంతకాలం పాటు గ్వాంటనామో బే జైల్లో ఉన్నాడు. అతడిని తదనంతరం సౌదీ అరేబియా జైలుకు తరలించారు. అయితే, 2006లో రుబాయిష్ అక్కడి నుంచి నాటకీయ ఫక్కీలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ సౌదీ జాతీయుడు అల్ ఖైదాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News