: టిపినీలు తినకుంటే కష్టమేనట

ప్రతిరోజూ అల్పాహారం, అదేనండీ టిఫిన్‌ చేయకుంటే కష్టమేనంటున్నారు పరిశోధకులు. మనవాళ్లు ఉదయం పూట టిఫిన్‌ చేయడం మానేస్తే కాస్త బరువు తగ్గుతాం కదా అనుకుని టిఫిన్‌ చేయడం మానేస్తుంటారు. అయితే ఇలా మానేయడం వల్ల బరువు తగ్గేమాట దేవుడెరుగు... మన గుండెకు చాలా ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందునా ఆడవారికన్నా మగవారికే ఇలాంటి ప్రమాదం అధికంగా ఉంటుందని వీరు చెబుతున్నారు.

బోస్టన్‌లోని హార్వార్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన పౌష్టికాహార విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక సుదీర్ఘ అధ్యయనాన్ని చేపట్టారు. సుమారు 16 ఏళ్లపాటు సాగిన ఈ అధ్యయనంలో ఉదయం పూట టిఫిన్‌ చేయని మగవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 27 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. ఈ శాస్త్రవేత్తలు 1992 నుండి 2008 సంవత్సరాల మధ్య దాదాపు 27 వేలమంది పురుషుల ఆహారపు అలవాట్లను నిశితంగా పరిశీలించారు. వీరిలో ఉదయం పూట ఏమీ తినకుండా మధ్యాహ్నం ఎప్పుడో భోజనం చేస్తూ, రాత్రి బాగా పొద్దుపోయాక తిని పడుకునేవాళ్లలో ప్రాథమికంగా ఊబకాయం, బిపి, షుగరు వంటి రోగాలు వచ్చినట్టు గుర్తించారు. తర్వాత కొద్దికాలంలోనే వీరిపై గుండె సంబంధ వ్యాధులు కూడా దాడిచేశాయి. మొత్తంగా వీరు నిర్వహించిన ఈ సుదీర్ఘ అధ్యయనంలో సరైన ఆహారపు వేళలను పాటించకపోవడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావడంతోబాటు రక్తనాళాలు కూడా దెబ్బతిని, గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని పరిశోధకులు తేల్చారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, శరీరానికి తగుమాత్రం వ్యాయామం లేకుండా పోవడం వల్ల, పొగతాగడం వంటి జీవన శైలి కారణంగా ఇలాంటి అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువవుతున్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

More Telugu News