: దమ్ముతోబాటు పెగ్గు అలవాటవుతుంది

గుప్పు గుప్పు మంటూ దమ్ము కొట్టడం అలవాటు అయితే, దాని వెంటనే మందు కొట్టడం కూడా అలవాటు అవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కొందరు పొగరాయుళ్లు తమకు మందు అలవాటు లేదని, ఎప్పుడైనా ఒకసారి దమ్ము కొట్టడం మాత్రమే అలవాటుందని చెబుతుంటారు. అయితే ఇలా పొగలాగించేసేవాళ్లు తొందరగా మద్యానికి బానిసలవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి పొగలోని నికోటిన్‌కు అలవాటు పడ్డ ఎలుకలు మిగిలిన వాటికంటే ఎక్కువసార్లు మద్యాన్ని రుచిచూడడానికి ఉవ్విళ్లూరాయట. నికోటిన్‌ మెదడు నియంత్రణ కేంద్రాన్ని నిద్రపుచ్చడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడులోని నియంత్రణ కేంద్రం ఇలా సద్దుమణగడానికి కారణం నికోటిన్‌తో ఒత్తిడి హార్మోన్ల చురుకుదనం అకస్మాత్తుగా పెరగడమేనని చెబుతున్నారు. కాబట్టి పొగరాయుళ్లు మద్యపానానికి వీలైనంత దూరంగా ఉండాలని, అలాగే మద్యపాన అలవాటు నిరోధానికి, చికిత్సకు కూడా ఒత్తిడి హార్మోన్ల పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News