: దూరంగా ఉంటేనే దగ్గరవుతారు

మనం రోజూ ఒకటిగా కలిసి ఉంటూ తిరిగే జంటలను చూస్తూ ఉంటాం. అయితే ఈ జంటల్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇద్దరూ ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోవడంలో పొరబాటు పడే అవకాశం ఉంది. అలా కాకుండా దూరంగా ఉండే జంటలు ఒకరి గురించి మరొకరు సరిగా అర్ధం చేసుకుంటారని, దానివల్ల వారి మధ్య బంధం మరింత గట్టిపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

హాంకాంగ్‌ నగర విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టల్‌ జియాంగ్‌, కార్నెల్‌ వర్సిటీ పరిశోధకుడు జెఫ్రె హాన్‌కాక్‌ ఇలా దూరపు బంధాలపై అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో రోజంతా కలిసి మెలిసి తిరిగే జంటల కంటే దూరంగా ఉంటూ డేటింగ్‌ చేసేవారే ఒకరిని గురించి మరొకరు అర్ధం చేసుకుని, ఆనందంగా అన్యోన్యంగా ఉంటున్నట్టు తేలింది. నిజానికి రోజూ దగ్గరగా ఉండే జంటలకంటే ఇలా దూరంగా ఉండే జంటలే పరస్పరం సరైన అవగాహనతో ఉంటారని, ఒకరిని గురించి మరొకరు సరిగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని తేలింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలోని ఫోన్‌లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు, వీడియో చాటింగ్‌లు, ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిళ్లు వంటి వాటి ద్వారా నిత్యం తమ భాగస్వామితో అవతలి వారు టచ్‌లో ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. కాబట్టి దూరంతో బంధం దగ్గరవుతుందిమరి!

More Telugu News