పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వంగూరు రవీందర్ రెడ్డి

హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా డాక్టర్ వంగూరు రవీందర్ రెడ్డి ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాలకు చెందిన రవీందర్ రెడ్డి వెటర్నరీ విద్యలో పీహెచ్డీ పూర్తి చేశారు. పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో పౌల్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ గా, కోరుట్ల వెటర్నరీ అసోసియేట్ డీన్ గా, డీన్ వెటర్నరీ సైన్స్ గా మూడేళ్లు, రిజిస్ట్రార్గా పని చేసి రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. తిరిగి అదే యూనివర్సిటీకి వీసీగా నియమింపబడడం విశేషం. సోమవారం పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఇంచార్జ్ వీసీ అనిత రాజేంద్ర పుష్పం గుచ్చంతో ఆహ్వానించి పదవీ బాధ్యతలను అప్పగించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో గతంలో నిర్లక్ష్యం కాబడ్డ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలకు ప్రాధాన్యతతో పాటు బాధ్యత కూడా పెరిగిందని, ఉచిత గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లలను చెరువులో విడవడం, సాగునీటి రాకతో పంటల దిగుబడి పెరిగడంతో బర్రెలు, పశువుల పెంపకం పెరుగుతున్నదని, తెలంగాణ రైతాంగానికి మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామని వీసీ రవీందర్ రెడ్డి అన్నారు. వీసీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

More Press News