ప్రజాపాలన నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్

Related image

హైదరాబాద్, డిసెంబర్ 27:: రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీలు, 3626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి 3714 అధికార బృందాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన దరఖాస్తు ఫారాలు అన్ని గ్రామాల్లో విస్తృతంగా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను నియమించామని తెలిపారు. గ్రామ సభలు ఉదయం 8 గంటలకే ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై నేడు రాత్రి జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ మహిళలకు పురుషులకు వేరు వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయటమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి 100 దరఖాస్తు దారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏ విదమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు షామియానా, బారికేడింగ్, తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు.

ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతీ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమ హాజరయ్యే వారినుండి అభయహస్తం క్రింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన వారు ముందస్తుగా దరఖాస్తును నింపి ప్రజాపాలన సదస్సు కౌంటర్లో సమర్పించి రశీదును పొందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ సభల షెడ్యూల్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, పురపాలక శాఖ కమీషనర్ హరిచందన, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ అశోక్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases