మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే: పవన్ కళ్యాణ్

Related image

మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే... ఇవి శాశ్వతం కాదనీ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు ఎంతో కాలం మనుగడ సాధించలేవని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పి.ఎ.సి. చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పి.ఎ. సి. సభ్యులు హాజరయ్యారు. శాశ్వతమైన పరిపాలనా రాజధాని అమరావతిలో మాత్రమే ఏర్పాటవుతుందన్నారు. అది జనసేన-బీజేపీ పార్టీలతోనే సాధ్యమవుతుందనీ, మూడు రాజధానుల ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీతో కలసి పనిచేయడానికి వివిధ స్థాయిల్లో రెండు పార్టీల నాయకులతో సమన్వయ కమిటీలు ఏర్పాటవుతాయని పీఏసీ సభ్యులకు తెలిపారు. సమన్వయ కమిటీల నిర్ణయం మేరకు ఆయా ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.
 
• రాజకీయ లబ్ది కోసం ప్రజల్ని విభజించి పాలిస్తున్నారు 
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "5 కోట్ల మంది ప్రజలతోపాటు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో అమరావతి రాజధాని ఏర్పాటయ్యింది. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులు.. ప్రజల ఆక్రందన, ఆక్రోశం, ఆందోళన మధ్య ఏకపక్షంగా ఏర్పాటవుతున్నాయి. 7,200 మంది పోలీసులను నియమించి, ప్రజలను భయభ్రాంతులను చేసి, నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై లాఠీలను ప్రయోగించి వైసీపీ శాసనసభాపక్షం శాసనసభా సమావేశాలను ప్రారంభించింది. విశాఖపట్నం, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని ఆయా ప్రాంతాల మీద ప్రేమతో ఏర్పాటవుతున్నవి కాదు. విభజించి పాలించు అనే బ్రిటీష్ వారి సూత్రాన్ని అమలుచేసి, ప్రాంతాల మధ్య బేధభావాలు సృష్టించి వైసీపీ ప్రభుత్వం రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది. నిజానికి ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధినే కానీ ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం కాదు. రాయలసీమ ప్రాంతవాసులకు విశాఖపట్నం దూరాభారం అని తెలిసినా అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడం వెనకాల విశాఖపై వైసీపీకి ఉన్నది ఆపేక్ష కాదు... స్వలాభాపేక్ష. పుష్కలంగా ఉన్న భూ సంపదను చేజిక్కించుకోవడమే వైసీపీ పెద్దల అసలు వ్యూహం. ప్రశాంతతకు మారుపేరయిన విశాఖపట్నాన్ని ఫ్యాక్షనిస్టుల నుంచి జనసేన-బీజేపీ పార్టీలు కాపాడుకుంటాయి. విశాఖ నగరాన్ని అభివృద్ధి పరంగా విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి జనసేన-బీజేపీలు కృత నిశ్చయంతో ఉన్నాయి.

• ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు రేపారు 
ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాజధాని పేరిట అలజడులు సృష్టించి పెట్టుబడిదారులు ఈ వైపు కన్నెత్తి కూడా చూడడానికి వీలులేని పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం సృష్టించింది. రాష్ట్రంలో అన్ని రంగాలు క్షీణ దశలో ఉన్నాయి. ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. నిరుద్యోగులు చైన్నై, బెంగళూరు, హైదరాబాద్ వైపు తరలిపోతున్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక పండిన పంటలు దాచుకోవడానికి కనీసం శీతల గిడ్డంగులు లేక ఉసూరుమంటున్నారు. పై సమస్యలకు పరిష్కారం చూపే సత్తా జనసేన- బీజేపీ పార్టీలకు మాత్రమే ఉంది. ఒక చక్కటి రాజధానిగా అమరావతిని రూపుదిద్ది పరిపాలనకు మాత్రమే దీనిని పరిమితం చేస్తాము. ప్రభుత్వ పరంగా, ప్రయివేటు పరంగా ఏర్పాటు కావలసిన పరిశ్రమలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. ప్రతి ప్రాంతాన్ని స్వయం పోషకంగా తీర్చిదిద్దుతాము. స్థానిక పరిపాలనను బలోపేతం చేసి ప్రజలు చిన్న చిన్న పనులకు రాజధాని వరకు రానవసరం లేని వ్యవస్థకు రూపకల్పన చేస్తాము.

• రాపాక వ్యాఖ్యలను గర్హిస్తున్నాం 
జనసేన టిక్కెట్టుపై గెలుపొందిన శ్రీ రాపాక వరప్రసాదరావు గారు ఈ రోజున శాసనసభలో చేసిన ప్రసంగం జనసేన పార్టీ నిర్ణయాలకు విరుద్దంగా ఉంది. ఆయన వాణి జనసేన బాణీ కాదు. జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని శ్రీ రాపాక చేసిన వ్యాఖ్యలను మేము గర్హిస్తున్నామ"ని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నందుకు పీఏసీ సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అభినందించారు. బీజేపీతో పొత్తు ఓ మంచి పరిణామం అని, దేశానికి, తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని, బీజేపీతో పొత్తు పట్ల ఆంధ్రప్రదేశ్ లో సర్వత్ర హర్షం వ్యక్తమవుతుందని ఇందుకు కారకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు శ్రీ తోట చంద్రశేఖర్, శ్రీ కొణిదెల నాగబాబు, శ్రీ కోన తాతారావు, శ్రీ కందుల దుర్గేష్, శ్రీమతి పాలవలస యశస్విని, శ్రీ డా.పసుపులేటి హరిప్రసాద్, శ్రీ మనుక్రాంత్ రెడ్డి, శ్రీ పంతం నానాజీ, శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ పితాని బాలకృష్ణ, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, అధ్యక్షులు రాజకీయ కార్యదర్శి శ్రీ పి. హరిప్రసాద్ పాల్గొన్నారు.

తరలింపు తాత్కాలికమే... ‘అమరావతి’ శాశ్వత రాజధాని
 
రాజధాని వికేంద్రీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం... ఆ పార్టీ వినాశనానికి పునాది అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని .. దానిని ఇక్కడ నుంచి కదిలించడం అసాధ్యమని అన్నారు. కాదు కూడదని కదిలించినా అది తాత్కాలికమేనని అన్నారు. ఈ విషయాన్ని గ్రామ గ్రామానికీ తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. సోమవారం రాత్రి మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. బీజేపీ అగ్ర నాయకత్వం ఒకటే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అది ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు నిర్మించడాన్ని సమర్ధిస్తున్నాం. కానీ వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనసేన పార్టీ వ్యతిరేకం. మూడు రాజధానుల అంశం అచరణీయం కాదు. రాజధాని అంటే టీడీపీ, వైసీపీ పార్టీలకు ఆటైపోయింది. రాజధాని పేరుతో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. రెండు పార్టీలను బలంగా ఎదుర్కొంటాం.

• వైసీపీకి విశాఖపై ప్రేమ లేదు 
ఇంతపెద్ద రాజధాని అవసరం లేదని ఆనాడే చెప్పాను. గాంధీనగర్ తరహాలో 10 నుంచి 14 వేల ఎకరాలు చాలన్నాను. టీడీపీ ప్రభుత్వం నా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న నెపంతో ఏకంగా రాజధానినే వైసీపీ ప్రభుత్వం వైజాగ్ కు తరలిస్తుంది. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నంలో ఫ్యాక్షన్ కల్చర్, రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలని చూస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు తెలంగాణలో చేస్తే ఛీకొట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయాలని అనుకుంటున్నారు. దీనిని యువత, మహిళలే బలంగా అడ్డుకోవాలి. రాజధానిని ఉత్తరాంధ్ర తరలించడానికి కారణం అక్కడి ప్రజలపై ప్రేమ కాదు...రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలన్న ఆశ. ఉత్తరాంధ్ర భూములు అక్కడ ప్రజల చేతుల్లో లేవు. రాజకీయ నాయకుల చేతుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయాయి. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమే ఉంటే పలాసలో క్యాషు బోర్డు ఈ పాటికే వచ్చి ఉండేది. రాయలసీమ ప్రాంత వెనుకబాటుకు ఆ ప్రాంత నాయకులే కారణం.

• సంయమనం కోల్పోతే పరిస్థితులు చేయిదాటిపోతాయి 
ప్రజాస్వామ్యబద్ధంగా రాజధాని మార్పు జరిగితే.. రాజధాని గ్రామాల్లో 7 వేల 400 మంది పోలీసులు ఎందుకు..?. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతు రోడ్డున పడ్డాడు. లాఠీదెబ్బలు తింటున్నాడు. రక్తం చిందిస్తున్నాడు. ఆడపడుచుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వారికి అండగా ఉన్న జనసేన వీర మహిళలపై దాడులు చేశారు. పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడ్డ రైతులను పరామర్శిస్తానంటే లా అండ్ అర్డర్ పేరు చెప్పి పర్మిషన్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కుటుంబాలను విడిచి రోడ్ల వెంట తిరగడంతో పాటు మహిళలతో తిట్లు తినే స్థాయికి పోలీస్ వ్యవస్థని ప్రభుత్వం దిగజార్చింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించలేదు. డి.ఐ.జి. స్థాయి అధికారిని పంపించి మా కార్యాలయంలోనే మమ్మల్ని నిర్భందించారు. అడుగు బయటపెట్టకుండా చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తే ఇలానే చేశారా..?. ఒక్క క్షణం సంయమనం కోల్పోతే పరిస్థితులు చేయిదాటిపోతాయి. పోలీసు శాఖ, లా అండ్ అర్డర్ పై ఉన్న గౌరవంతో ఇంతసేపు ఆగాను. పోలీసుల నిమిత్త మాత్రులు మాత్రమే. ఏమైనా అనాలి అంటే వారిని పంపిన ప్రభుత్వ పెద్లను అనాలి.

• రాపాకపై ప్యాక్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం 
ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ... వైసీపీ ప్రభుత్వం వారికి అశాంతి, అలజడి ఇచ్చింది. ఈ ఏడు నెలల్లో చట్టానికి లోబడి ఒక్క పని కూడా చేయలేదు. అన్ని చట్టానికి విరుద్ధంగానే చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి ఈ రోజు ఇన్ సైడ్ ట్రేడింగ్ అని చెప్పి రాజధాని తరలిస్తున్నారు. నిజంగా తప్పు జరిగితే అధికార యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టి జైల్లో వేయాలి. అంతే తప్ప రాజధాని మార్చడం సబబు కాదు. జనసేన, భారతీయ జనతా పార్టీలు రాజధాని రైతుల ఆందోళనలకు అండగా ఉంటాయి. ఈ రోజే జె.పి.నడ్డా గారు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అని అన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ రాపాక వరప్రసాద్ గారికి ఇవాళ పొద్దున్నే తెలియజేశాం రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఓటు వేయమని, కానీ ఆయన జనసేన పార్టీ స్టాండ్ కాకుండా వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. ఇది చాలా బాధకలిగించింది. ఆయన చర్యలపై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

 జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్న పోలీసులు
 రాజధాని గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం రాత్రి గంట 7.30 నిమిషాల సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మందడం, యర్రబాలెం తదితర గ్రామాలు సందర్శించి రైతులను పరామర్శించేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే పార్టీ కార్యాలయం లోపలకి చొచ్చుకు వచ్చిన పోలీస్ ఉన్నతాధికారి కాంతి రాణా టాటా ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఆయనను అడ్డుకున్నారు. దీంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు పాటు పార్టీ నాయకులు పోలీసుల తీరుని తప్పుబట్టారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం పట్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి పెట్టిన పార్టీ కార్యాలయంలోకి పోలీసులు వచ్చి అడ్డుకోవడాన్ని ప్రశ్నించారు. దాదాపు గంటన్నర సేపు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోలీసులను దాటుకుని రాజధాని గ్రామాలకు వెళ్లే ప్రయత్నం చేయగా, అనుమతించమంటూ భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్న విషయం తెలుసుకున్న జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్తారని తెలుసుకున్న పోలీసులు పీఏసీ సమావేశం జరుగుతుండగానే భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఓ డీఐజీ, ఓ అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, ఓ సిఐ జనసేన కార్యాలయంలోకి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజధాని ప్రాంతానికి వెళ్లడానికి అనుమతి లేదనీ, ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ఆంక్షలు విధించినా తాను రాజధాని ప్రాంతానికి వెళ్లి తీరుతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తేల్చడంతో వందల సంఖ్యలో పోలీసులు పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆయన్ను అడ్డుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు వందల సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

More Press Releases