పారదర్శకత, అక్రమాల నివారణకు ఈ - మైనింగ్ మొబైల్ యాప్ : మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

Related image

హైదరాబాద్, సెప్టెంబర్ 30 :: గనులు భూగర్భ వనరుల శాఖలో మరింత పారదర్శకతను పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ మైనింగ్ మొబైల్ యాప్ దోహదం చేస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంలో సిఎస్ శాంతి కుమారి, గనుల శాఖ డీఎం జి పి. కాత్యాయని దేవి లతో కలిసి తెలంగాణ ఈ - మైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గనులు, భూగర్భ వనరుల శాఖ మరియు హైదరాబాద్ లోని జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసి) సంయుక్తంగా ఈ మొబైల్ యాప్ ను అభివృద్ధి పరిచినట్లు చెప్పారు. 


ఈ మైనింగ్ యాప్ తో గనులు, ఇటుక, ఇసుక రవాణా జరిగినప్పుడు రవాణా వాహనాలను తనిఖీ చేసి ట్రాన్సిస్ట్ ఫామ్ మరియు ట్రాన్సిస్టర్ అనుమతులు ఉన్నాయా లేవా అని అంశాలను ఆన్ లైన్ లో వెంటనే సిబ్బంది తెలుసుకోవచ్చని తెలిపారు. అక్రమ రవాణా, అనుమతులు లేకుండా కానీ, అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో రవాణాకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకొని, పెనాల్టీ విధించి ఆ సమాచారాన్ని వాహన యజమానికి ఆన్ లైన్ పద్ధతిలో లింక్ ద్వారా పంపించి వెంటనే పెనాల్టీ వసూలు చేసేందుకు సిబ్బందికి, అలాగే చెల్లించేందుకు వాహన యజమానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు. డీలర్లు మరియు లీజు హోల్డర్లు ఖనిజ రవాణాలో ఆన్ లైన్ ద్వారా తమ రవాణా చేసుకునేందుకు శాఖా పరమైన అనుమతుల నిర్ధారణ సైతం తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే తనిఖీలు నిర్వహించే గనుల శాఖ ఏడీలు, అసిస్టెంట్ జువాలజిస్టులు, టెక్నీషియన్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్లకు వాహనాల తనిఖీ చాలా సులభం అవుతుందని వెల్లడించారు. 


ఈ మైనింగ్ మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు వెంటనే తీసుకోవడంతో పాటు పారదర్శకత మరింత పెరుగుతుందని చెప్పారు. ఇసుకతో పాటు ఇటుక, ఖనిజాల అక్రమ రవాణాలో పారదర్శకతకు ఎంతో తోడ్పడుతుందని, దేశంలోనే ఎక్కడలేని విధంగా అభివృద్ధిపరిచే దశలో ఉందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. 

More Press Releases