రాజకీయ లబ్ధి కోసమే రాజధాని తరలింపు.. ప్రజల కోసం కాదు: నాదెండ్ల మనోహర్

Related image

•ప్రభుత్వ పిచ్చి నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం

•క్యాబినెట్ కు తెలియకుండా ముఖ్యమంత్రి నిర్ణయాలు 

•జగన్ స్వార్ధ ప్రయోజనాలు గుర్తించి పోరాడండి 

•విభజించి పాలించాలనే దరిద్రమైన ఆలోచన చేశారు 

•రైతుల ఆందోళనలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది 

•అమరావతి రైతులకు మద్దతుగా చేపట్టిన నిరసన దీక్షలో జనసేన రాజకీయ వ్యవహారాల 

కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసమే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారని జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.  విభజించి పాలించాలనే దరిద్రమైన ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్నారని  విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పిచ్చి నిర్ణయాలకు రాష్ట్రం బలికాకూడదని అన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 22 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పంజా సెంటర్ లో బుధవారం ఉదయం సామూహిక నిరసన దీక్ష చేపట్టింది. పార్టీ అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేశ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ దీక్షలో నాదెండ్ల మనోహర్ గారితోపాటు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం మాటలు కాదు... గొప్ప త్యాగం. బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి మరీ భూములు ఇస్తే... వారి త్యాగాలను ప్రభుత్వం అవమానిస్తోంది. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు లాభపడ్డారని, ఒక పార్టీకి లాభం చేకూరిందని ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు దీటుగా ఎదుర్కొనాలి. నిజంగా రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే విచారించి ఈ 7 నెలల్లో శిక్షించాల్సింది. అలా చేయలేకపోయిన ఈ ప్రభుత్వ అసమర్ధత స్పష్టంగా అందరికీ కనిపిస్తోంది. 

•మాటలు మార్చే ముఖ్యమంత్రిని ఎవరైనా నమ్ముతారా? 

ప్రతిపక్షంలో ఉన్పప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి... ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వగానే మాట మార్చేశారు. ఇలాంటి మాటలు మార్చే వ్యక్తిని ఎవరైనా ఎందుకు నమ్ముతారు..? పెట్టుబడులు ఎలా వస్తాయి..? అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఈ ఏడు నెలల్లో బస్తా సిమెంట్ పెట్టి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. యువత కోరేది ఉపాధి, రైతులు కోరేది గిట్టుబాటు ధర, మహిళలు కోరుకునేది భద్రత.... వీటన్నింటినీ పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం, మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అఖిలపక్ష నేతల మాటెలా ఉన్నా, కనీసం అక్కడ రైతులతోనైనా మాట్లాడి భరోసా కల్పించాలి. శాసనసభలో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. కానీ రాజధానిపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఆయన క్యాబినెట్ కు కూడా తెలియని విచిత్రమైన పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది. 

•ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు

ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణా, గుంటూరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రభుత్వం చూస్తోంది. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించడం సాధ్యమేనా..? కేంద్రం పరిధిలో ఉన్న అంశాన్ని చేసేస్తామని మీరెలా మాటిస్తారు..? చట్టాల్లో ఉన్న అంశాలను చదివారా అసలు..? సాధ్యం కాని హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఒక ప్రాంతం ప్రజల పొట్ట కొట్టి..‌మరో ప్రాంత ప్రజల పొట్ట నింపుతామంటారా..? మీకు దమ్ము, ధైర్యం ఉంటే...  ప్రభుత్వం విధానం స్పష్టంగా ప్రకటించాలి. ముఖ్యమంత్రి స్పందించాలి. సబ్ కమిటీ వేసి రాజధాని ప్రాంత రైతుల మనోభావాలు తెలుసుకోవాలి. వారితో మాట్లాడి భరోసా కల్పించాలి. రాజధాని మార్చడం వల్ల రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుందో వివరించాలి తప్ప మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరుగుతుందని మభ్యపెట్టే ప్రకటనలు మానుకోవాలి. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే మిమ్మల్ని ఎవరైనా ఆపుతారా..? 

•చక్రవర్తుల పాలనలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు 

రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. వారిపై కేసులు పెట్టి అవమానిస్తున్నారు.  రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళుతుంటే ఇంటికో ఇద్దరు పోలీసులను పెట్టి వలలు, వస్త్రాలు పట్టుకొని కాపలా కాస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు చూడలేదు. రాజులు, చక్రవర్తుల పాలనలో కూడా ఇలాంటివి జరిగిన దాఖలాలు లేవు.  ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. చేతిలో పోలీసు యంత్రాంగం ఉందని రైతులపై కేసులు పెడతామంటే మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇది వరకే చెప్పారు. ప్రజాసామ్యంలో ఇలాంటి పరిస్థితులు మంచిది కాదు. రైతులు తమ ఆవేదన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. 

•కొత్త పెన్షన్ ఒక్కటైనా వచ్చిందా..? 

ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు కావొస్తోంది. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇప్పటి వరకు చేపట్టలేదు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటి సంతకం వృద్ధులకు పెన్షన్లపై పెట్టారు. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని మాటిచ్చారు. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. మగ్గాలు ఉన్నవారికి ఏడాదికి రూ. 24 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2 లక్షల 60 వేల కుటుంబాలు ఉంటే ఇప్పుడు 70 వేల మందికే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి పథకంలో ఆంక్షలు పెడుతూ నిజమైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. ఈ ఏడు నెలల్లో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. ఏదైనా పని చేశారు అంటే అది ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు పులమడమే.

•నాలుగు గోడల మధ్య తీసుకున్న నిర్ణయం కాదు 

రాజధాని అంశంపై జనసేన పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది. రాజధాని ఒకే చోట ఉండాలని పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రజాప్రతినిధులు, నిపుణులు, మూడు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మాదిరి నాలుగు గోడల మధ్య ఏసీ గదుల్లో కూర్చొని ఇష్టారీతిన నిర్ణయం తీసుకోలేదు. అందరినీ సంప్రదించి తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయం వల్ల ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. మనం మాట్లాడే మాటలు ప్రజల్లో ధైర్యం నింపాలి కానీ, అభద్రతా భావం నింపకూడదని చర్చించి నిర్ణయం తీసుకున్నాం. మన రాజధాని అనే భావనతోనే రైతులు తమ భూములను త్యాగం చేశారు. వారి ఆందోళనలకు జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉంటుంద”ని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ కార్యదర్శులు గద్దె తిరుపతిరావు, చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ నేతలు బత్తిన రాము, ముత్తంశెట్టి ప్రసాద్ బాబు, అక్కల గాంధీ, కమతం సాంబశివరావు, పంచకర్ల సందీప్, పాకనాటి గౌతమ్, పెదపూడి విజయ్ కుమార్, నయూబ్ కమల్, జిలానీ, చెన్నా శ్రీనివాస్, ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ, అమ్మిశెట్టి వాసు, రావి సౌజన్య, అజయ్ వర్మ అమరావతి పరిరక్షణ సమితి నేత శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు.

More Press Releases