ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ లు ఇవాళ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Related image

హైదరాబాద్, జులై 03 :: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోడు భూముల పట్టా పంపిణీ పురోగతిని సమీక్షించారు. గృహలక్ష్మి పథకం, ఎరువులు, విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, బీసీ చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ పథకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ వానకాలం సీజన్‌లో లబ్ధిదారులకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించాల్సి ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీని వేగవంతం చేసి వారంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. పోడు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను రైతు బంధు పోర్టల్‌లో జమ చేయాలని, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, తాజాగా చెట్లను నరికివేయకుండా చర్యలు తీసుకోవాలని సి.ఎస్ ఆదేశించారు. ఎరువులు, విత్తనాల నిల్వల గురించి జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ పరిస్థితిని పర్యవేక్షించాలని, జిల్లాలో తగినంత నిల్వలను అందుబాటులో ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నందున ఈ ఏడాది ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని, రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టేలా రైతులను ఒప్పించేందుకు రైతులకు అవగాహన కల్పించే వినూత్న మార్గాలను ఆలోచించాలని సిఎస్ తెలిపారు.

జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి, ఆ మిల్లులు ఏ సామర్థ్యంతో పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని, మిల్లుల్లోని స్టాక్ పొజిషన్‌ను కూడా సరిచూసుకోవాలని కలెక్టర్లను సి.ఎస్ ఆదేశించారు. ఇంకుడు గుంతల పనులు పూర్తి చేయాలని, హరిత వనాలు, దశాబ్ధి సంపద వనాలపై దృష్టి పెట్టాలని, వర్షాలు కురవడం ప్రారంభించిన తర్వాత మొక్కలు నాటించాలని ఆమె ఆదేశించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు మొక్కలతో నిండిఉన్నందున తోటలను ఎక్కడ చేపట్టాలనే దానిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. బీసీ చేతివృత్తిదారులకు ఆర్థిక సహాయం కింద అందిన దరఖాస్తులన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ప్రక్రీయను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇటీవల మంజూరైన 4,852 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని కలెక్టర్లను ఆమె కోరారు.

పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, రిజిస్ట్రేషన్ అండ్స్టాం పుల ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రోడ్లు, భవనాల కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఎస్సీ డెవలప్‌మెంట్ కార్యదర్శ రాహుల్ బొజ్జా, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు.   
 -----------------------------------------------------------------------------------------------------------------------

More Press Releases