బాలల న్యాయ మండలి, బాలల సంక్షేమ సమితులకు పునరుజ్జీవం కల్పిస్తాం: డాక్టర్ కృతికా శుక్లా

Related image

  • సభ్యుల నియామక ప్రకియలో భాగంగా మోఖిక పరీక్షలు
  • వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న స్ధానాలకు త్వరలో నియామక ఉత్తర్వులు
బాలల న్యాయ మండలి, బాలల సంక్షేమ సమితులకు పునరుజ్జీవం కల్పిస్తున్నట్లు ఏపీ మహిళాభివృద్ధి, శిశు, బాలల సంక్షేమం, సంస్కరణల సేవలు, వీధి బాలల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. చాలా కాలంగా ఈ కమిటీలలో ఖాళి  అయిన స్ధానాలు భర్తీకి నోచుకోలేదని ముఖ్యమంత్రి ఆదేశాలతో వాటిని పూరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించి ఈ కమిటీలలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే క్రమంలో సోమవారం గుంటూరులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మౌఖిక పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో కృతికా శుక్లా మాట్లాడుతూ జువెనైల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు సాధారణ కోర్టులకు ఉండే అన్ని అధికారాలు ఉంటాయని, ఇవి నేరారోపణ చేయబడిన, రక్షణ, సంరక్షణ అవసరమైన 18 ఏళ్ల లోపు పిల్లల కేసులపై విచారణ జరిపి పరిష్కరిస్తాయన్నారు.

ముఖ్యంగా పోస్కో చట్టం క్రింద నమోదయ్యే కేసుల విచారణ, పరిష్కారంలో పోలీసులు, ప్రత్యేక కోర్టులతో పాటు జువెనైల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. పోస్కో చట్టం క్రింద అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 ఏళ్ల లోపు పిల్లల కేసుల విచారణను జువెనైల్ జస్టిస్ బోర్డులే చేయవలసి ఉంటుందని వివరించారు. బాధితులైన పిల్లలకు సత్వర రక్షణ, పునరావాసం విషయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలదే కీలక భూమి కాగా ఈ కమిటీ సభ్యుల నియామకంతో ఆ కమిటీలు విచారణ ప్రక్రియలను వేగవంతం చేయగలుగుతాయని శుక్లా పేర్కొన్నారు. ఖాళీలను భర్తీ చేయడం ద్వారా, ఆయా జిల్లాల్లో పిల్లలపై నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి వీలవుతుందన్నారు.

మరోవైపు పిల్లలు తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పులను సరిదిద్ది, వారు పెద్దయ్యాక సక్రమ జీవనం కొనసాగించేలా చేయడంతో బాటు, ఎటువంటి రక్షణ లేని పిల్లలకు రక్షణ కల్పించడానికి ఈ బోర్డులు, కమిటీలు కృషి చేయవలసి ఉంటుందన్నారు. నియామక ప్రకియలో భాగంగా విజయనగరం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని జువెనైల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లలో ఏర్పడిన ఖాళీలను భర్తీకి ప్రస్తుతం మోఖిక పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. అర్హులైన అభ్యర్థుల నుండి గత సంవత్సరం నవంబరులో దరఖాస్తులను ఆహ్వానించగా, 381 ధరఖాస్తులు వచ్చాయని, ప్రాధమిక పరిశీలన అనంతరం 120 మందిని ఇంటర్వ్యూకు పిలిచామని పేర్కొన్నారు. సోమవారం ప్రారంభమైన ఇంటర్యూలు జనవరి తొమ్మిది వరకు జరగనున్నాయి.

అయా జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లలోని 10 ఖాళీలను, జువెనైల్ జస్టిస్ బోర్డులలోని 6 ఖాళీలను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుండగా, పూర్తి స్ధాయి పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా వారికి నియామక ఉత్తర్వులు విడుదల చేస్తారు. నియామక బోర్డుకు హై కోర్ట్ రిటైర్డ్ జడ్జ్ డాక్టర్ జస్టిస్ కె.జి.శంకర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తుండగా, జువెనైల్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల కన్వీనర్ గా, ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగపు ప్రొఫెసర్ కె.విశ్వేశ్వర రావు, చైల్డ్ లైన్ రీజినల్ కో-ఆర్డినేటర్ అనురాధ, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మలత సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలోని ‘రక్షణ, సంరక్షణ అవసరమైన, చట్టంతో విభేదించబడిన పిల్లల కేసులను విచారణ జరిపి సకాలంలో వాటిని పరిష్కరించడానికి జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ & రక్షణ) చట్టం 2015 లోని సెక్షన్ 4, సెక్షన్ 27 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో జువెనైల్ జస్టిస్ బోర్డులు (బాలల న్యాయ మండలి), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (బాలల సంక్షేమ సమితి)లను ఏర్పాటు చేసి, సభ్యులను నియమిస్తుంది.

More Press Releases