తినే ముద్దకు కులం ఉందా...? మరి పండించే రైతులను కులాలుగా విడదీస్తారా?.. పవన్ కళ్యాణ్

Related image

మానవత్వం నా మతం... ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా కులం అని చెప్పుకొన్న జగన్ రెడ్డి గారు కౌలు రైతులను కులాల వారిగా ఎందుకు విడగొట్టారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఎన్నో కులాలు కష్టపడితేగానీ నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్లవు.. ఆ ముద్దకు కులం ఉందా? అలాంటిది పండించే వారిని కులం పేరుతో విడగొట్టడం బాధ కలిగించిందని అన్నారు. అన్నదాతతో కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు మనుగడ సాగించిన దాఖలాలు చరిత్రలో లేవని అన్నారు. రైతాంగం సమస్యల పరిష్కారానికి జనవరి నుంచి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారానికి గురువారం కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. ఉదయం 8.15 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత రైతులు నిమ్మరసం ఇచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దీక్షను విరమింపజేశారు. అనంతరం దీక్షా వేదిక నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “విద్యార్ధులకు సెలవులు ఉంటాయి. రాజకీయ నాయకులకు సెలవులు ఉంటాయి. కానీ అన్నం పెట్టే రైతుకు మాత్రం సెలవులు ఉండవు. 365 రోజులు కష్టపడుతూనే ఉంటాడు. పంటను చీడ, పురుగుల నుంచి పసిబిడ్డను కాపాడినట్లు కాపాడుతాడు. చేతికొచ్చిన పంటకు లాభసాటి కాదు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తున్నాడు. రైతుల పక్షాన మనం లాభసాటి ధర కోరాలి. మట్టి మనిషి కష్టం మీదే మనందరం బతుకుతున్నాం... కానీ పండించే రైతు కన్నీరు మాత్రం ఆగడం లేదు.

• తేమ అంటారు... ధాన్యం ఆరబోయడానికి కళ్ళాలు ఎక్కడ?
  దళారులు, వ్యాపారులు, పెట్టుబడుదారులు ఇలాంటి వ్యవస్థ మధ్య రైతు మనుగడ సాగించాలంటే చాలా కష్టం. రైతులు పడుతున్న కష్టాలు చూసి రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. ప్రభుత్వం కొలువుతీరిన 10 రోజుల్లోనే కూల్చివేతలు మొదలు పెట్టారు. ప్రజా వేదికను కూల్చేశారు. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల బతుకులు కూల్చేశారు.
ఇప్పుడు రైతులను కూల్చేస్తున్నారు. ఇంతమందిని కూల్చేసిన ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుంది. నన్ను ఎవరూ ఏం చేయలేరని జగన్‌ రెడ్డి గారికి అనిపించవచ్చు. ఎంతో మంది చక్రవర్తులు, రాజులే కాలగర్భంలో కలసిపోయారు. వైసీపీ ప్రభుత్వం ఎంత..? 151 మంది ఎమ్మెల్యేలు ఎంత..?

కేంద్ర ప్రభుత్వం 17 శాతం తేమ, 25 శాతం ముక్క ఉన్నా కొనాలని చెబుతుంటే.. సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం 14 శాతం తేమ ఉంటే తీసుకోమని చెబుతున్నారు. తేమ ఎండాలంటే ధాన్యాన్ని ఆరబోయడానికి స్థలాలు కావాలి. తేమ అంటేనే రైతులు కంగారుపడుతున్నారు. కోసిన ధాన్యం ఆరబోయడానికి ఇబ్బందులు ఉన్నాయి. రైతులకు కళ్ళాలు లేవు. కాంక్రీట్ కళ్ళాలు కావాలి ప్రభుత్వం సమకూర్చాలి అని మోహన్ కందా కమిషన్ చెప్పింది. ఉన్న అరకొర స్థలాలను అధికారులు స్మశానాలుగా మార్చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల ఇదే సమస్య. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తాళాలు వేసి ఉంటున్నాయి. ఆదివారం కూడా పని చేయాల్సిన కేంద్రాలు.. పని చేయకుండా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి గత ఏడాది సేకరించినదాంట్లో ఈ ఏడాది సగం కూడా సేకరించలేదు. ఇప్పటికే రైతుల నుంచి వెళ్ళిన ధాన్యం ఎక్కడ ఉందో ఎవరూ చెప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల రికార్డుల్లో లేదు. రైతుల దగ్గర లేదు. మరి ఎక్కడ ఉంది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి గారి ఇంటి రిపేర్ కు రసీదులు ఉంటాయి కానీ.. రైతు పంటకు రసీదులు ఉండవు. రైతుకు రసీదు ఇవ్వని 150 మంది ఎమ్మెల్యేలు ఎందుకు..?.

• రైతులను దోచేస్తున్నారు
  జాతీయ ఉపాధి హామీ పథకం చాలా ఉన్నతమైన ఆశయంతో పెట్టిన పథకం. రైతుల ఆత్మహత్యలు, వలసలు నిరోధించాలని ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకంలో అడుగడుగునా అక్రమాలే. రైతులను కూలీలుగా రాయడానికి అధికారులు వాటాలు అడుగుతున్నారు. ఒకవైపు రైతులను దోచుకుంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఈ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని రైతులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మన దగ్గర చాలా మంది చిన్న, సన్నకారు రైతులకు కూలీలను పెట్టుకునే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడినే తిరిగి రాబట్టుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. మన నాయకులు వ్యవసాయ శాస్ర్తవేత్తలు, ఇంజనీర్లతో కూర్చొని తక్కువ ఖర్చుతో సాగు యంత్రాలు తయారు చేయడం ఎలాగో మేథోమధనం చేయాలి. తక్కువ ఖర్చుతో అగ్రికల్చర్ లో కొత్త టెక్నాలజీలను రైతుల కోసం తీసుకొస్తే ఎమ్మెల్యేలు తీసుకున్న జీతాలకు న్యాయం జరిగినట్లే.
• ఉల్లిపాయల కోసం తొక్కిసలాట ఏమిటి?
ఉల్లిగడ్డ ప్రతి ఒక్కరు తినే ఆహారం. ముఖ్యంగా పేదవారికి ఉల్లిగడ్డ ఉంటే చాలు. చద్దన్నంలో వేసుకొని తింటారు. అలాంటి ఉల్లిగడ్డ కోసం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో తొక్కిసలాట జరిగింది. ఉల్లిపాయల కోసం తొక్కిసలాట జరగడం ఏంటి..? తొక్కిసలాటలు జరగకుండా కిలో ఉల్లిపాయలు ఇవ్వలేరా..? ఇంగ్లీషు మీడియంకు జనసేన వ్యతిరేకం కాదని చెప్పాం. అయితే తెలుగు మీడియం కూడా ఉండాలని కోరుతున్నాం. పిల్లలను ఏ మీడియంలో చదివించాలో తల్లిదండ్రులకే వదిలేయాలని డిమాండ్ చేస్తున్నాం. వాటిని పక్కదారి పట్టించి పవన్ కళ్యాణ్ ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జనసేన పార్టీ పెట్టింది ఓట్లు కోసం పదవుల కోసం కాదు. ప్రజాసేవ కోసం. ఈ ప్రభుత్వానికి గోదావరి బోటు ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మ శాంతికి నివాళి అర్పించాలనే హృదయం లేదు. అసెంబ్లీలో వారికి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించలేరా?
• వందల కోట్లు ఎగ్గొట్టేవాళ్లు చట్ట సభలో కూర్చుంటున్నారు
రైతులకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు చాలా ఇబ్బందులు పెడతాయి. కానీ ఎంతో మంది ప్రజాప్రతినిధులు బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టి చట్టసభల్లో దర్జాగా కూర్చున్నారు. రుణాలు కట్టకపోతే రైతులను పీక్కుతింటారు. వాళ్లను మాత్రం అడిగే దిక్కు లేదు. అందుకే రైతులకు కడుపు మండుతుంది. సూట్ కేసు కంపెనీలు పెట్టి మీరు ముఖ్యమంత్రి అయితే .. కష్టపడే రైతుకు కడుపు మండదా..? బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పెద్ద మనసుతో ఆలోచించి రైతులకు అండగా ఉండాలి. అలాగే రైతుల ప్రతినిధిగా మాట్లాడాలంటే తగ్గే మాట్లాడాలి. రైతుల సమస్యలు తీరాలంటే ప్రభుత్వాల వద్ద తగ్గే మాట్లాడాలి. మర్యాదగా అడుగుతున్నాం... 75 కేజీల ధాన్యం బస్తాకు రూ. 1300 కాదు రూ. 1500 ఇవ్వండి. మీరు చేసిన ఆలస్యానికి క్షమాపణ చెప్పినట్లు ఉంటుంది.2050 నాటికి ఆహార అవసరాలు సరిపోవు. తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అందుకే దూరదృష్టితో ఆలోచించే జనసేన మ్యానిఫెస్టులో లక్షమంది యువరైతులను తయారు చేస్తానని అన్నాను. ప్రతినెల రైతుకు రూ. 5 వేలు పింఛన్ ఇస్తానన్నది వాళ్లను దళారుల నుంచి రక్షించడానికే. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొనే ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నాం. రైతులకు అండగా జనసేన పార్టీ నిలబడుతుంది. ఏపీలోని రైతులందరూ సంఘటితంగా నిలబడితే సమస్యలు ఎందుకు పరిష్కారం కావో నేను చూస్తాను. వ్యవసాయ శాస్ర్తవేత్తలు, బ్యాంకు అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించేలా చూస్తాను. అలాగే జనవరి నెల నుంచి రైతు సమస్య పరిష్కారం కోసం యాత్రలు చేపడతాను” అన్నారు.
• ప్రభుత్వం కుట్ర పన్ని బురద జల్లుతోంది: శ్రీ నాదెండ్ల మనోహర్
 రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ మీద వస్తున్న ప్రచారాలు నిజమా, కాదా అనే అంశాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి. జనసేన పార్టీ ఓ శక్తిగా ఎదుగుతోందన్న అక్కసుతో, ప్రజా సమస్యల మీద తీవ్రంగా పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం మన మీద కుట్ర పన్ని 400-500 మంది వాలంటీర్లకు జీతం ఇచ్చి మరీ తీసుకుని బురద చల్లుతోంది. మీరు ఆ దుష్ప్రచారాలు నిజమా? కాదా? అన్నది చూసుకోవాలి. వారు చేసే వ్యక్తిగత దూషణలు మన నాయకుల కుటుంబాలను ఇబ్బందులు పెట్టే స్థాయికి వెళ్లాయి.

మార్పు తీసుకువస్తాం.. 21 రోజుల్లో చర్యలు తీసుకుంటాం, 10 రోజుల్లో శిక్షలు వేస్తాం అని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటున్నారో అంతా చూస్తున్నాం. ఏ పథకం చూసినా కొందరికే వర్తిస్తోంది. రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కేవలం 40 శాతం మంది ఖాతాలకు మాత్రమే చేరాయి. మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయాయి. జాప్యం ఎందుకు జరుగుతోంది. మీకు ఒక ప్రణాళిక లేదు. అందుకే ప్రకటనలకు పరిమితం అయ్యి రైతులను ఇబ్బందులుపెడుతున్నారు. రైతులను ఇబ్బందులు పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించింది లేదు. చరిత్రలో చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద నాయకులు సైతం రైతుల ముందు దిగిరావాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో వచ్చి మాటలు చెప్పే నాయకులను ప్రజలు దూరంగా పెట్టండి. ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం ప్రజా జీవితంలోకి రావాలిగానీ వ్యాపారాలు చేసుకోవడం కోసం రాకూడదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వద్దకు వచ్చిన ప్రతి సమస్య మీద స్పందిస్తారు. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల బాగు కోసమే చేపడుతుంది. ప్రజలకు అండగా నిలబడుతుంది. కాకినాడలో రైతు సమస్యల మీద పోరాటం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తక్షణం నిర్ణయం తీసుకున్నారు. మండపేట రైతుల కల్లాల దగ్గర కూర్చున్నప్పుడు ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరితో ఏ విధంగా ఇబ్బందులు పెడుతోందన్న అంశాన్ని గుర్తించి ప్రభుత్వానికి మూడు రోజులు సమయం ఇచ్చాం” అన్నారు.

• రైతుల నుంచి విశేష స్పందన
గురువారం ఉదయం నుంచి ‘రైతు సౌభాగ్య దీక్ష’ ప్రాంగణానికి రైతులు స్వచ్ఛందంగా వచ్చారు. పలువురు రైతులు వేదికపై నుంచి తమ సమస్యలను వివరించారు. పలు సందర్భాల్లో రైతులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడి, పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వివరంగా నమోదు చేసుకున్నారు. కౌలు రైతులు తమను కులాల వారీగా విభజించి రైతు భరోసా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.• జనసేనాని హుందాతనం
ఈ వేదికపై నుంచి ప్రసంగించిన పాతపట్నం జనసేన నాయకుడు శ్రీ చైతన్య చేసిన ఓ వ్యాఖ్యపై జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందించిన విధానం రైతాంగాన్ని, సభికులను ఆకట్టుకొంది. ప్రసంగం ముగించిన తరవాత చైతన్యను పిలిచి ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. ఎదుటి పక్షం ఎంత ఇబ్బందిపెట్టినా... మన పార్టీ విధానాలకు అనుగుణంగా హుందాగానే ఉందామని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఇంచార్జ్ శ్రీ కొణిదెల నాగబాబు గారు, పార్టీ ముఖ్య నేతలు శ్రీ అర్హం ఖాన్, శ్రీ టి.శివశంకర్, శ్రీ సత్య బొలిశెట్టి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు మిగిలిన 11 జిల్లాల నుంచి జనసేన నేతలు హాజరయ్యారు. తమతమ జిల్లాల్లోని రైతాంగం సమస్యలను వివరించారు.


More Press Releases