జనసేన మరో ప్రధాన కార్యదర్శిగా తమ్మిరెడ్డి శివశంకర్!

Related image

జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా తమ్మిరెడ్డి శివశంకర్ ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు. ఇప్పటికే తోట చంద్ర శేఖర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజా నియామకంతో ఇద్దరు ప్రధాన కార్యదర్శులయ్యారు. సోమవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ చేతుల మీదుగా శివశంకర్ నియామక పత్రం అందుకున్నారు. విశాఖపట్నంలో చేపట్టిన లాంగ్ మార్చ్ అనంతరం పవన్ కల్యాణ్ శివ శంకర్ కు అభినందనలు తెలుపుతూ పార్టీపరంగా ఆయనకు ముఖ్య బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఆ క్రమంలో ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 

•అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాల ప్రభావంతో:

ప్రభుత్వ సర్వీసు నుంచి 2018లో స్వచ్ఛంద పదవి విరమణ చేసి జనసేన పార్టీలో శివశంకర్ చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన తొలుత హైడ్రో జియాలజిస్ట్ గా పని చేశారు. 1995లో గ్రూప్ 1కు ఎంపికై వాణిజ్య పన్నుల శాఖలో పలు ముఖ్య బాధ్యతల్లో విధులు నిర్వర్తించారు. అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాలతో ప్రభావితమైన శివశంకర్ శ్రీకాకుళంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆలోచన విధానాలకు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకొంటూ, పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా ఉన్నారు. 

శివశంకర్ మాట్లాడుతూ “ఇది పదవి కాదు బాధ్యత అని భావిస్తున్నాను. పార్టీలో నిబద్ధతతో కష్టపడి పని చేసేవారిని పవన్ కల్యాణ్ గుర్తిస్తారు అనడానికి నేనే ఉదాహరణ. నాకు ఈ బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను” అని అన్నారు.

More Press Releases