ఆగస్టు 1 నుండి ఓటరు జాబితా సవరణలకు నూతన మార్గనిర్దేశకాలు: ముఖేష్ కుమార్ మీనా

Related image

అమరావతి: ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటవ తేదీనుండి నూతన మార్గనిర్దేశకాలు అమలు కానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందన్నారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించబడిందని, ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటరు మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని మీనా తెలిపారు. జాబితాలో పేరు తొలగింపుకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధృవీకరణ పత్రాన్ని జతచేయవలసి ఉంటుందన్నారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఇప్పటి వరకు దీనిని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై దానిని విభిన్న అంశాలకు వినియోగించనున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలోనే కాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించనున్నామన్నారు.


నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే ఉన్న నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి తమ ఆధార్ నంబర్‌ను తెలియచేయవలసి ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛంధమని, ఆధార్ నంబర్‌ను సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగించటం ఉండదని మీనా స్పష్టం చేసారు.  ఇప్పటికే ఉన్న ఓటర్లుగా నమెదై ఉన్న వారి ఆధార్ నంబర్ కోసం నూతనంగా ఫారమ్ 6బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్ వి ఎస్ పి, వి హెచ్ ఎ తదితర వెబ్ సైట్ లలో ఈ నెలాఖరు నాటికి నూతన ధరఖాస్తు అందుబాటులో ఉంటుందన్నారు. 6బి ధరఖాస్తును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఎన్నికల సంఘంకు సమర్పించవచ్చన్నారు. ఎన్ విఎస్ పి, ఓటర్ల హెల్ప్‌లైన్ యాప్‌ని అనుసరించి స్వీయ-ప్రామాణీకరణతో యుఐడిఐఎతో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌ ఓటిపిని ఉపయోగించి ఆధార్‌ను ప్రామాణీకరించవచ్చన్నారు.

స్వీయ-ప్రామాణీకరణ పట్ల ఆసక్తిలేని వారు, స్వీయ-ప్రామాణీకరణ విఫలమైన సందర్భంలో అవసరమైన పత్రాలతో ఫారమ్ 6బిని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు. మరోవైపు బూత్ లెవల్ అధికారి ఓటరు జాబితాతో ఓటర్ల నుండి ఆధార్ నంబర్‌ సేకరించడానికి ఇంటింటిని సందర్శించటంతో పాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని మీనా పేర్కొన్నారు. ఆధార్ సంఖ్యను అందించడం పూర్తిగా స్వచ్ఛందమని, ఓటర్లు ఆధార్ నంబర్‌ను అందించలేకపోతే ఫారం 6బి లో పేర్కొన్న పదకొండు ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలన్నారు. ఆధార్ సంఖ్యను సేకరణ, నిర్వహణ కోసం అన్నిజాగ్రత్తలు తీసుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జనబాహుళ్యంలోకి వెళ్లకూడదని, ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు ఇఆర్ఓల ద్వారా డబుల్ లాక్‌తో సురక్షితమైన కస్టడీలో ఉంచబడతాయని, యుఐడిఎఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమీషన్  నియమించిన లైసెన్స్ పొందిన ఆధార్ వాల్ట్‌లో ఓటర్ల ఆధార్ నంబర్ జాగ్రత్త చేయబడుతుందని మీనా స్పష్టంచేసారు.

More Press Releases